Medak Road Accident : ఆసుపత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు...! రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి-father and son died in road accident while going to hospital in medak district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Road Accident : ఆసుపత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు...! రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి

Medak Road Accident : ఆసుపత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు...! రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 04:36 PM IST

మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో తండ్రికొడుకు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం (image source from unsplash.com)

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్తున్న తండ్రికొడుకులను మృతువు రూపంలో అతి వేగంగా వచ్చిన ట్యాంకర్ వీరి బైక్ ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రికొడుకులు దుర్మరణం చెందారు.

ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఏం జరిగిందంటే…?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నశంకరంపేట మండలం సురారానికి చెందిన తండ్రీకొడుకులు దొంతి భూదయ్య (65), దొంతి మల్లేశం(35). తండ్రి వ్యవసాయం చేస్తుండగా , కొడుకు చిన్నశంకరంపేట ఎంపిడిఓ ఆఫీసులో స్కావెంజర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య మౌనిక, రెండేళ్ల కూతురు ఉన్నారు.

కొంతకాలంగా తండ్రి భూదయ్య గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో కొడుకు మల్లేశం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తండ్రిని తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. వీరు చేగుంట నుండి 44వ జాతీయ రహదారి మీదుగా రామంతాపూర్ శివారులోకి రాగానే నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి వీరి బైక్ ని వెనక నుండి ఢీకొట్టింది. తండ్రీకొడుకులు ట్యాంకర్ ముందు చక్రాల కింద పడి పడడంతో వారి నడుము మీద నుండి లారీ వెళ్ళింది .

మిన్నంటిన రోదనలు

ఈ ప్రమాదంలో కొడుకు మల్లేశం అక్కడికక్కడే మృతి చెందగా.. భూదయ్య కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనిని వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో తుప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి పెద్దలు ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ కుటుంబంలో ఇద్దరు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో సూరారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

యువకుడిని ఢీకొట్టిన కారు:

విధులకు బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట పరిధిలో చోటుచేసుకుంది.

ప్రాథమిక వివరాల ప్రకారం హవెలి ఘన్పూర్ మండలంలోని చౌట్లపల్లి గ్రామానికి చెందిన చీమల గణేష్ (28) ప్రైవేట్ బ్యాంక్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. సోమవారం విధులకు బైక్ పై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న గణేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని అతడిని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి సిద్దయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

సంబంధిత కథనం