Mlc Election Voters : ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు- ఈ నెల 30 నుంచి ఓటర్ల నమోదు ప్రారంభం
Mlc Election Voters : నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొదలయ్యాయి.
Mlc Election Voters : నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల (సెప్టెంబర్) 30 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు.
2025 మార్చి 29 నాటితో ముగియనున్న కాలపరిమితి
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ స్థానంతో పాటు, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పిస్తూ ఈ నెల 30న పబ్లిక్ నోటీసును జారీ చేయనుందని తెలిపారు. అక్టోబర్ 16, 25 వ తేదీలలో రెండు పర్యాయాలు పత్రికాముఖంగా కూడా ప్రకటనలు జారీ చేస్తారని అన్నారు.
ఇంతముందు ఓటు ఉన్నవాళ్లు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
2024 నవంబర్ 06 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని, అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఏఈఆర్ఓ) కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23 న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుంచి డిసెంబర్ 09 వ తేదీ వరకు తెలియజేయవచ్చని ఆమె అన్నారు.
డిసెంబర్ 30న తుది జాబితా
2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల 30 నుండి 2024 నవంబర్ 06 వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్లు ఫారం-18 లో, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఫారం-19 లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.
కట్టుదిట్టంగా ఓటరు జాబితా సవరణ: సీఈఓ సుదర్శన్ రెడ్డి
సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా పై సమీక్ష నిర్వహించారు . ఎస్ఎస్ఆర్-2025 లో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ సమ్మరీ రివిజన్, ఈ.ఆర్.ఓ నెట్ 2.0 తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా సీ.ఈ.ఓ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణలో భాగంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియ వేగవంతమయ్యిందని, వారం రోజుల వ్యవధిలోనే 55 శాతం నుండి 95 శాతానికి చేరుకుందని జిల్లా కలెక్టర్లు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ లు, సూపర్వైజర్లను అభినందించారు.
సంబంధిత కథనం