Ponnam Prabhakar: కరీంనగర్‌లో మంత్రి పొన్నం యాక్షన్ షురూ,ప్రగతి నివేదికలపై అసహనం-minister ponnams action in karimnagar dissatisfaction with progress reports ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponnam Prabhakar: కరీంనగర్‌లో మంత్రి పొన్నం యాక్షన్ షురూ,ప్రగతి నివేదికలపై అసహనం

Ponnam Prabhakar: కరీంనగర్‌లో మంత్రి పొన్నం యాక్షన్ షురూ,ప్రగతి నివేదికలపై అసహనం

HT Telugu Desk HT Telugu
Jun 19, 2024 08:55 AM IST

Ponnam Prabhakar: కరీంనగర్ లో రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాక్షన్ మొదలుపెట్టారు. అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

ప్రగతి నివేదికలపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
ప్రగతి నివేదికలపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Ponnam Prabhakar: కరీంనగర్ లో రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యాక్షన్ మొదలుపెట్టారు. అభివృద్ధి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతి నివేదికలు అస్తవ్యస్తంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి, విచారణకు ఆదేశించారు.

తప్పు చేసిన వారిని, భూ కబ్జాదారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో సమస్యను చెప్పుకునే అవకాశం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఎక్కడ ఏ తప్పు జరిగినా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

కరీంనగర్ కలెక్టరేట్ లో నగర పాలక సంస్థ పనితీరు, స్మార్ట్ సిటీ, శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, పన్నుల వసూలు, తాగునీటి సరఫరా, పలు అంశాలపై మంత్రి పొన్నం సమీక్షించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోపాటు మేయర్ సునీల్ రావు సమావేశానికి హాజరుకాలేదు.

కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ తోపాటు మున్సిపల్ వివిధ శాఖల అధికారులు సమీక్ష సమావేశం పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని, ప్రజలకు విశ్వాసం కలిగించేలా పనిచేస్తుందని తెలిపారు. తప్పు జరిగితే చర్యలు ఉంటామనే నమ్మకం ప్రజలకు కల్పిస్తామన్నారు.

సీఎం అస్సురెన్స్ కింద 80 పనులకు 37 కోట్ల మంజూరు చేశారని అందులో కొన్ని పనులకే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. దానిపై విచారణ తోపాటు అడిషనల్ కలెక్టర్ పర్యవేక్షణలో పనులు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. తీగెల వంతెన, స్మార్ట్ సిటీ పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు. స్మార్ట్ సిటీ క్రింద 22 హాట్ స్పాట్ ఏర్పాటు చేస్తే కేవలం 128 మంది మాత్రమే వినియోగించు కుంటున్నారని ప్రజలందరు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జవాబుదారితనం ఉండేలా చూడాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

అవినీతి రహితంగా పనిచేయండి

పారదర్శకంగా, జవాబు దారీతనంతో పని చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని సూచించారు. డంప్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కార మార్గం అన్వేషించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఏండ్ల నాటి నుంచి ఈ సమస్య ఉత్పన్నం అవుతున్నదని దీనికి పరిష్కార మార్గం చూడాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సేకరించాలని సూచించారు. అదేవిధంగా సొంత జాగాలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టిన వివరాలు సేకరించాలని ఆదేశించారు. వీటిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా చేపట్టే నిర్మాణాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

టౌన్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగితే మీరే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్ లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అన్నారు ప్రజాధనాన్ని వృధా చేయవద్దని ప్రతి పనిని నాణ్యతతో చేపట్టాలని, ప్రజలకు ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత క్రమ పద్ధతిలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు.

పనులు పూర్తి చేయని వారికి బిల్లులు చెల్లించే పద్ధతికి స్వస్తి పలకాలని ఆదేశించారు. తాగునీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపెద్ద సంస్థలు, మాల్స్ నిర్వాహకుల నుంచి ఎప్పటికప్పుడు పన్నులు వసూలు చేయాలని తెలిపారు.

జనరల్ ఫండ్స్ కింద చేపట్టిన పనులపై అధికారులు రీ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని పేర్కొన్నారు. మానేరు రివర్ రెంట్ పనులను వేగవంతంగా చేపట్టి సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 73 శాతం పనులు కంప్లీట్ అయ్యాయని తెలిపారు.

ప్రతివారం కలెక్టర్ సమీక్ష

వన్ టౌన్ ఎదురుగా మాజీ ఎంపీ జువ్వాడి చొక్కా రావు విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతివారం కార్పొరేషన్ సంబంధించిన ప్రతి విభాగంపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రతివారం సమీక్షతో మున్సిపల్ కార్పొరేషన్ పాలనపై జవాబుదారీ తనం పెరుగుతుందని పేర్కొన్నారు.

మున్సిపల్ అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మేమున్నామని భరోసా ఇవ్వాలని పేర్కొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వసక్తి మహిళలను కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు.

బస్ స్టేషన్‌లో కాన్పు చేసిన సిబ్బందిని అభినందించిన మంత్రి

కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటి నొప్పులతో అవస్థపడ్డ వలస కూలీ కుమారికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలను అడ్డుపెట్టి వలస కూలికి కాన్పు చేసిన సైదమ్మ తో పాటు ఆర్ఎం, వన్ డిపో మెనేజర్, సిబ్బందిని శాలువాతో సత్కరించి ఐదు వేల రూపాయల చొప్పున నగదు రివార్డు అందజేశారు. 108 కు సమాచారం ఇచ్చి అంబులెన్స్ వచ్చేలోగా కాన్పు చేసి తల్లి పిల్ల క్షేమంగా ఆసుపత్రికి పంపించిన సిబ్బంది పనితీరు ప్రశంసనీయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్)Ht

WhatsApp channel