Minister Gangula | రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి
రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. రైతులను కేంద్రం నట్టేట ముంచిన పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారన్నారు.
రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సివిల్ సప్లైస్ భవన్లో భేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణపై మిల్లర్లతో నిర్వహించిన ఈ సమావేశం సుధీర్ఘంగా కొనసాగింది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నుండి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని మంత్రి గంగుల తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మిల్లర్లకు సూచించారు. మిల్లర్ కు రైతుకు సంబంధం ఎందుకని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించి మిల్లుకు పంపుతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క కిలోను సైతం మిల్లుల్లో కోత పెట్టవద్దని సూచించారు.
కరెంటు, సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా వంటి వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతన్నారని మంత్రి గంగుల అన్నారు. ఒకరికొకరు అనుసంధానంగా ఉండే మిల్లర్లు సైతం బాగుపడే దశలో .. కేంద్రం రైతులతో వ్యాపారం చేయడం సరికాదన్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా కాక సామాజిక బాధ్యతతో చూడాలని, ఆదాయమే కావాలంటే జీఎస్టీ, ఇన్ కంటాక్స్ వంటి వాటిలో చూసుకోవాలన్నారు. శ్రీలంక వంటి సంక్షోభం మన దగ్గర వస్తే ఏ దేశం కూడా మన దేశాన్ని ఆదుకోలేదన్నారు. అందుకే ఫుడ్ సెక్యూరిటీ ఆక్ట్ ని నిరుగార్చకుండా కనీసం 3 ఏళ్ల ఆహార నిల్వలు ఉంచుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనం అని అంటే అలర్లు సృష్టించాలని కపట కుట్రలతో రైతులను నిండా ముంచి ప్రయోజనం పొందాలని కొందరు చూశారని రైస్ మిల్లర్ల ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి రైతుల్ని నష్టపోకుండా ఆదుకున్నారని అదే విదంగా మిల్లింగ్ ఇండస్ట్రీని ఆదుకోవాలన్నారు. కొంత మంది మిల్లర్లను దొంగలుగా చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు అందర్నీ బాధ్యుల్ని చేయొద్దన్నారు. మంత్రి దృష్టికి సమస్యలను తీసుకొచ్చారు.
రైస్ మిల్లర్లు లేవనెత్తిన అంశాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గంగుల తెలిపారు. సీఎస్ కమిటీ కచ్చితంగా అందరికీ అనుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపు నింపే వ్యక్తని ఏ ఒక్కరి కడుపు కొట్టరని చెప్పారు. ఎవరూ ఆధైర్య పడవద్దన్నారు. కేంద్రం నిట్ట నిలువునా ముంచిన ఈ కష్ట సమయంలో అందరం సమన్వయంతో పనిచేస్తూ రైతుల్ని కాపాడుకుందామని మంత్రి గంగుల అన్నారు. మంత్రి గంగుల మాట్లాడిన తీరుతో మిల్లర్లు ప్రభుత్వానికి సహకరిస్తామని ధాన్యం అన్లోడింగ్ చేసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ధాన్యం కొనుగోళ్ల వివరాలతో కూడిన ప్రత్యేక సంచిక విడుదల చేశారు.
టాపిక్