TG Mee Seva Online : మీ-సేవా కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు - 3 రోజులుగా ఇబ్బందులు!
తెలంగాణవ్యాప్తంగా గత మూడు రోజులుగా మీ-సేవా ఆన్ లైన్ సేవలు నిలిచిపోయాయి. కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో… సర్వర్ ను అప్డేట్ చేస్తున్నారు. దీంతో మీ-సేవా సేవలు నిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించనున్నారు.
ఆన్ లైన్ సేవలకు నిలయమైన మీ -సేవలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా పని చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మీ సేవలో కొన్ని సేవలను చేర్చుతూ దాని కోసం సాఫ్ట్ వేర్ అప్ డేట్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో ఈ నెల 10 నుంచి మీ సేవలు బంద్ అయ్యాయి.
సర్వీస్ సేవలను యాడ్ చేస్తుండడంతో లాగిన్ లో ఎర్రర్ అని వస్తుంది. మీ సేవల ద్వారా జరిగే కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలు గుతుంది. ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఆర్టీఏ లాంటి సేవ లకు విఘాతం కలుగుతుంది. రెండు నెలలుగా సర్టిఫై కాపీలు రావడం లేదని మీ సేవా నిర్వాహకులు వాపోతున్నారు.
గత మూడు రోజులుగా ప్రజలు మీ సేవలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో జరిగే పనులకు మీ సేవలే కీలకం. అలాగే విద్యాశాఖలో సర్టిఫై కాపీలతో పాటు స్కాలర్ షిప్ లకు, ఫీజు రీయంబర్స్ మెంట్ లకు మీ సేవలు ఆధారం. రవాణా శాఖలో పలు కార్యకలాపాలకు కూడా మీసేవలే ఆధారం. గత మూడు రోజులుగా వాటికి ఇబ్బందులు తప్పడం లేదు
రిజిస్ట్రేషన్ శాఖ మాత్రం యథావిధిగా సేవలందించడం కొసమెరుపు. రాష్ట్ర ప్రభుత్వం మీ సేవల ద్వారా కొత్తగా 9 రకాల సేవలను అందుబాటులోకి తెస్తుంది. తహసీల్దార్ కార్యా లయాల్లో కాకుండా ధృవీకరణ పత్రాలను ఆన్ లైన్ ద్వారా అందించాలని భూ పరిపాలన శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం తహసీల్దార్లు జారీ చేస్తున్న పత్రాలను ఆన్ లైన్ లో మీ సేవా కేంద్రాల ద్వారా పొందేలా చర్యలు చేపట్టారు. 9 రకాల పత్రాలకు సంబంధించిన వివరాలను మీ సేవా ఆన్ బోర్డులో ఉంచేందుకు భూ పరిపాలన శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 380 మీ సేవా కేంద్రాల్లో మీ సేవలు నిలిచిపోయాయి. టీఎస్ పోర్టల్ ట్రాన్స్ అప్లికేషన్ లో సర్వస్ ఎర్రర్ రావడంతో మీ - సేవ కేంద్రాలకు వచ్చే వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్తున్నారు. మీ సేవా కేంద్రాల్లో ప్రతి రోజు 500 నుంచి 1000 రూపాయల సంపాదన ఉన్న కేంద్రాల్లో ఖాళీగా ఉంచుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
కొత్తగా ప్రభుత్వం పౌరులు పేరు మార్పిడి, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, లోకల్ క్యాండెట్, స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, మైనార్టీ సర్టిఫికెట్, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్, మార్కెట్ విలువ, కాస్రా, పహానీ వంటి పాత దృవీకరణ పత్రాలు, ఆర్ వోఆర్ సర్టిఫై కాపీలు పొందేందుకు మార్పులు చేపట్టింది. అయితే సర్వీస్ అప్ డేట్ కారణంగా సేవలు పొందలేకపోతున్నారు.
ఇటీవల ఉన్నత విద్యాశాఖ ఆన్ లైన్ కౌన్సెలింగ్ చేపట్టిన విషయం తెల్సిందే. వారికి సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు సర్వర్ అప్ డేట్ పూర్తయితే కానీ సేవలు పునఃప్రారంభం అయ్యే అవకాశాలు లేవని తెలిపారు.
ఇదే అంశంపై నిర్మల్ జిల్లా ఈ- సర్వీసెస్ మేనేజర్ నదీమ్ మాట్లాడుతూ… స్టేట్ డాటా సర్వీస్ లో కీలక సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. సమస్య పరిస్కారం కోసం సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారు. మూడు రోజులుగా మీసేవతో పాటు సర్వర్ పైన ఆధారపడ్డ ఇతర సర్వీసులు కూడా పౌరులకు అందడం లేదన్నారు. రెండు రోజుల్లో సర్వీసులు పునరుద్ధరిస్తామని చెప్పారు.
రిపోర్టింగ్ - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్