TS Weather Report: రోహిణి రాకముందే భానుడి విశ్వరూపం.. వడదెబ్బకు 7 మంది బలి!-maximum temperature recorded in last 24 hours in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather Report: రోహిణి రాకముందే భానుడి విశ్వరూపం.. వడదెబ్బకు 7 మంది బలి!

TS Weather Report: రోహిణి రాకముందే భానుడి విశ్వరూపం.. వడదెబ్బకు 7 మంది బలి!

HT Telugu Desk HT Telugu
May 17, 2023 10:33 AM IST

Temperatures in Telugu States: తెలంగాణలో భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది. మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

తెలంగాణలో ఎండల తీవ్రత
తెలంగాణలో ఎండల తీవ్రత (unsplash)

Temperatures in Telangana: తెలంగాణలో భానుడు భగభగలు పెరిగిపోతున్నాయి. ఎండ దాటికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితేనే ఎండల తీవ్రత పెరిగిపోతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. సాయంత్రం 5 దాటినా వేడి తీవ్రత ఉంటుంది. ఇక మంగళవారం చూస్చే ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. ఆ జిల్లాలోని మునగాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని దామరచర్లలో 45.1 డిగ్రీలు రికార్డు అయినట్లు టీఎస్ డీపీఎస్(Telangana State Development Planning Society) పేర్కొంది, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో సాధారణం కన్నా 3.8 డిగ్రీలు నమోదైనట్లు ప్రకటనలో పేర్కొంది.ఇక ఖమ్మం జిల్లాలో సాధారణం కన్నా 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అదనంగా రికార్డు అయినట్లు టీఎస్ డీపీఎస్ వెల్లడించింది. పలు జిల్లాల్లో నిన్నగరిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే……

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
నల్గొండ జిల్లా45.3
జయశంకర్45.1
పెద్దపల్లి జిల్లా44.5
ఖమ్మం 44.4
జగిత్యాల 44.3
మహబూబాబాద్44.3
కరీంనగర్44.3
మంచిర్యాల44.2
కొత్తగూడెం జిల్లా44.2
సూర్యాపేట44.0

7 మంది మృతి…

ఎండ తీవ్రతను తట్టుకోలేకా చాలా మంది అస్వస్థతకు గురి అవుతున్నారు. మంగళవారం వడదెబ్బ దాటికి ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని హెల్త్ డైరెక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.మిట్టమధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని పలు జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయ్యాయి.

రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి….

రోహిణి కార్తె వస్తే ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు ఇంకా ఎనిమిది రోజులు ఉండగానే... 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవేమి ఎండలు..? బాబోయ్ అంటూ జనం ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఎండల తీవ్రత వల్ల దినసరి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎండ తీవ్రత, వేడిగాల్పుల వల్ల కూలీలు వడదెబ్బకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.

AP Summer Updates: మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వేసవి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8°C లు, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో 46.7°C లు, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. పలు జిల్లాల్లో మొత్తంగా 13మండలాల్లో 46డిగ్రీలకు, 39 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, 255 మండలాల్లో 42°C -44°C ల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఎస్‌డిఎంఏ డైరెక్టర్ వెల్లడించారు.బుధవారం రాష్ట్రంలోని 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వివరించారు. మంగళవారం 40 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు , 148 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించారు. క్షేత్రస్థాయిలో ఎండ తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని అవి అందినప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం