భార్య మటన్ కూర వండలేదని 100కు డయల్ చేశాడు, తర్వాతేమైంది..?
ఒక వ్యక్తికి తన భార్య మీద కోపం వచ్చింది, ఎందుకు అంటే భార్య తనకు మటన్ కూర వండలేదని. ఇక తన ఫ్రస్ట్రేషన్ అదుపుతప్పింది. నేరుగా 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోండి.
Nalgonda | ఒర్సు నవీన్ అలియాస్ ఫ్రస్టేటడ్ భర్త. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా బాగా మద్యం సేవించాడు. కడుపులోకి వెళ్లిన 'రంగు' నీళ్లతో నవీన్ కూడా రకరకాలుగా రంగులు మారాడు. రాత్రి ఇంటికి వెళ్లి భార్యను మటన్ కూర చేయమని కోరాడు. అందుకు భార్య నిరాకరించి, ఉన్నది తిని చప్పుడు చేయకుండా పడుకోమంది. దీంతో నవీన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు మటన్ కూర చేయకపోతే పోలీసుకు చెప్తానంటూ హెచ్చరించాడు. అయినా కూడా అతడి భార్య అసలు కేర్ చేయలేదు.
ఇక లాభం లేదనుకున్న నవీన్ తన ఫోన్ తీసి 100కు డయల్ చేశాడు. తన భార్య మటన్ కూర వండలేదని, పోలీసులు వచ్చి తన భార్యను అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని ఫిర్యాదు చేశాడు. అయితే నవీన్ ఫోన్ చేసిన కాల్ ను ఎవరో మద్యం మత్తులో ప్రాంక్ కాల్ చేస్తున్నారని కంట్రోల్ రూమ్ వారు తేలిగ్గా తీసుకున్నారు. కానీ అప్పటికీ నవీన్ సంతృప్తి చెందలేదు, ఇంకా పోలీసులు రావడం లేదు.. తన భార్య మటన్ కూర వండలేదు, తీసుకెళ్లండి అంటూ 6 సార్లు 100కు ఫోన్ చేశాడట.
దీంతో ఇక లాభం లేదనుకొని పెట్రోలింగ్ పోలీసులు శుక్రవారం రాత్రి నేరుగా నవీన్ ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికీ నవీన్ మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్నాడు.
కానీ మరుసటి రోజు శనివారం ఉదయమే మళ్లీ ఒక పోలీసుల బృందం కనగల్ మండలం, చెర్ల గౌరారం గ్రామంలోని నవీన్ ఇంటికి వెళ్లారు. అతణ్ని అదుపులోకి తీసుకొని జైలుకి తీసుకెళ్లారు. అత్యవసర సేవల దుర్వినియోగం, పబ్లిక్‌గా దుష్ప్రవర్తనగా వ్యవహరించినందుకు అతడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని 290, 510 కింద కేసులు నమోదు చేశారు.
అత్యవసర సమయంలో, ఆపదలో ఉన్నప్పుడు ప్రజలను కాపాడేందుకు ఉద్దేశించిన 100 సౌకర్యాన్ని దుర్వినియోగం చేయవద్దని
కనగల్ ఎస్‌ఐ నగేష్ హెచ్చరించారు. అనవసరంగా పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేసినందుకు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
సంబంధిత కథనం