Kakatiya University: కేయూ మాజీ వీసీకి బిగుస్తున్న విజిలెన్స్ ఉచ్చు! వర్సిటీలో అక్రమాలపై విచారణ
Kakatiya University: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కు విజిలెన్స్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. 2021 మే నెలలో వీసీగా బాధ్యతలు తీసుకున్న ఆయన తన పదవీకాలంలో గత ప్రభుత్వ పెద్దల సహకారంతో వివిధ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
Kakatiya University: కాకతీయ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అక్రమాలపై విచారణ జరుగుతోంది. అక్రమాలపై గత జనవరిలో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, డా.మామిడాల ఇస్తారి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం మే 18న మాజీ వీసీ రమేష్ పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ ఏఎస్పీ బాలకోటి, సీఐలు రాకేశ్, అనిల్, హన్నన్ తదితరుల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో విజిలెన్స్ విచారణ కొనసాగింది.
విజిలెన్స్ అధికారులు విచారణకు వచ్చిన సమయంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఎంక్వైరీ జరిపేందుకు వచ్చిన ఆఫీసర్లు ఆయన తీరుపై అసహనానికి గురైనట్లు తెలిసింది. దాదాపు రెండు గంటల పాటు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో విచారణ జరిపిన విజిలెన్స్ ఆఫీసర్లు పలు కీలక అంశాలు సేకరించినట్లు సమాచారం. ఆ సమాచారంతో నివేదిక రూపొందించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. దీంతో కేయూ మాజీ వీసీ రమేష్ గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది.
మూడేళ్లు.. పదుల సంఖ్యలో ఆరోపణలు
కేయూ వీసీగా దాదాపు మూడు సంవత్సరాల పాటు పని చేసిన ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అనేక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీసీగా బాధ్యతలు తీసుకునేందుకు ప్రొఫెసర్ గా పదేళ్ల అనుభవం అవసరం అయినప్పటికీ తనకున్న పరిచయాలతో వైస్ ఛాన్స్ లర్ గా పోస్టింగ్ తెచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి.
అప్పట్లోనే కొందరు కోర్టుకు వెళ్లగా.. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అంతేగాకుండా వీసీ రమేష్ నింబధనలకు విరుద్ధంగా సీనియర్ ప్రొఫెసర్ గా ప్రమోషన్ పొందారనే ఆరోపణలున్నాయి. 2022లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన వీసీ.. తాను కూడా సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వాస్తవానికి వీసీ, రిజిస్ట్రార్ స్థాయిలో ఉన్న అధికారులు సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి చివరకు పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉంది. కానీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉన్న రమేష్ ఆ నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా తానే నోటిఫికేషన్ ఇచ్చి, తానే ప్రమోషన్ ఇచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి.
పర్మిషన్లు లేకుండానే నియామకాలు
ప్రభుత్వం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియమకాలను నిలిపివేయగా.. యూనివర్సిటీల అవసరాల మేరకు వీసీలు ప్రభుత్వ అనుమతి తీసుకుని అడ్జాంక్ట్ ఫ్యాకల్టీని నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ లూప్ హోల్ ను ఆసరాగా తీసుకున్న వీసీ రమేష్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 16 మందిని అడ్జాంక్ట్ ఫ్యాకల్టీని నియమించారనే ఆరోపణలున్నాయి. అంతేగాకుండా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు వీసీ రమేష్ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. ఫామ్ డీ కోర్సులు కలిగిన కాలేజీలకు అనుబంధ హాస్పిటల్స్ ఉండాలి. కానీ అలాంటి ఆసుపత్రులు లేకున్నా తరగతులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
బిల్లుల చెల్లింపులో అక్రమాలు
యూనివర్సిటీకి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల విషయంలోనూ మాజీ వీసీ రమేష్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది మొదట్లో వర్సిటీకి పాలు, పెరుగు సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిష్టయ్య ఏసీబీకి చిక్కగా, దాని వెనుక కూడా వీసీ చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇక పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరిగిన విషయం గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పీహెచ్డీ సీట్ల కేటాయింపులో పార్ట్ టైం అభ్యర్థులకు 25 శాతం, ఫుల్ టైం అభ్యర్థులకు 75 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా.. వీసీ కొన్ని సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపించాయి. దీంతోనే 2023 సెప్టెంబర్ లో యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు దాదాపు 50 రోజుల పాటు నిరసనలు చేపట్టారు.
కాకతీయ యూనివర్సిటీ భూములను వర్సిటీలోని ఏఆర్ పెండ్లి అశోక్ బాబు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారనే ఆరోపణలుండగా.. కబ్జా నిజమేనని తేలినా వీసీ రమేష్ లైట్ తీసుకున్నారనే విమర్శలున్నాయి. ఈ విషయంలో కూడా వీసీ రమేష్ పై విమర్శలు వచ్చాయి.
తొందర్లోనే నివేదిక
వైస్ ఛాన్సలర్ గా ప్రొ. తాటికొండ రమేష్ చేసిన అవినీతి అక్రమాలపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్స్(అకుట్) జనవరి 14, జనవరి 24 న రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది మే 18న రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ను విచారణకు ఆదేశించింది. ఇప్పటికే వర్సిటీలో భూముల కబ్జాలపై వరంగల్ విజిలెన్స్ ఆఫీసర్లు సర్వే చేసి నిగ్గు తేలుస్తుండగా.. మంగళవారం నుంచి మాజీ వీసీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.
అన్ని అంశాలపై లోతుగా వివరాలు సేకరించడంతో పాటు నివేదిక రూపొందిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఒక్కొక్కరిని సెపరేట్ గా ఎంక్వైరీ చేసి, పూర్తి వివరాలు సేకరించిన అనంతరం అక్రమార్కులపై యాక్షన్ ఉంటుందని ఓ అధికారి తెలిపారు. కాగా గత వీసీ హయాంలో అక్రమాలకు పాల్పడిన కొందరు సిబ్బంది గుండెల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)