Komatireddy Raj Gopal Reddy : మునుగోడు నుంచే నా పోటీ.. కాంగ్రెస్ ఆదేశిస్తే గజ్వేల్ బరిలోనూ ఉంటా - రాజగోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy : వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.
Komatireddy Raj Gopal Reddy : మునుగోడులోనే పోటీ చేస్తానని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన… వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ద్వారానే సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ కోసం పోరాడానని గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. నాటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లానని… కానీ బీఆర్ఎస్ పై పోరాటం చేసే విషయంలో బీజేపీ డీలా పడిపోయిందన్నారు. ప్రజల కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించటమే తన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే… గజ్వేల్ బరిలోనూ ఉంటానని అన్నారు. దమ్ముంటే కేసీఆర్… మునుగోడు లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఆత్మగౌరవం దక్కాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. పిల్లల భవిష్యత్తు కోసం కేసీఆర్ ను గద్దె దించాలని కోరారు. ప్రజాస్వామ్య పాలన రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. అక్టోబరు 27వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతానని చెప్పారు.
పార్టీ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. బీజేపీ తొలి జాబితాలోనే పేరు వచ్చేది కానీ… తన పేరు పెట్టవద్దని జాతీయ నాయకత్వాన్ని కోరారని తెలిపారు. కర్ణాటక ఫలితాల ప్రభావంతో తెలంగాణలో పరిస్థితులు మారాయని అన్నారు. కవితను అరెస్ట్ చేయకపోటవం కూడా రాష్ట్రంలో పరిస్థితుల మార్పునకు కారణమైందన్నారు. ప్రజల కోసమే పార్టీ మారనని… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదే అతిపెద్ద నిర్ణయమని పేర్కొన్నారు.
సంబంధిత కథనం