Komatireddy: కాంగ్రెస్ గూటికి ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..?-komati reddy rajagopal reddy may join the congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Komati Reddy Rajagopal Reddy May Join The Congress

Komatireddy: కాంగ్రెస్ గూటికి ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..?

HT Telugu Desk HT Telugu
Oct 23, 2023 12:19 PM IST

Komatireddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కోమటిరెడ్డి సైలెంట్ అయినా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోమారు తెరపైకి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)

Komatireddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు హాట్ టాపిక్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మారారు. ప్రసుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా, బీజేపీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి బాధ్యత వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆదివారం బీజేపీ నాయకత్వం ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేదు. మునుగోడు నుంచే తాను పోటీ చేస్తానని స్వయంగా రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. మధ్యలో ఎల్.బి.నగర్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఇవేవీ కార్యరూపం దాల్చక పోగా కోమటిరెడ్డి మరో కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు.

కాంగ్రెస్ గూటికి చేరుతారా?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమయ్యిందే కాంగ్రెస్ నుంచి. మధ్యలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు.

ఇపుడు ఆయన తిరిగి సొంత గూడు కాంగ్రెస్ కు తిరిగి వెనక్కి వస్తారన్న వార్త చర్చనీయాంశం అయ్యింది. రాజగోపాల్ రెడ్డి 2009 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా విజయం సాధించినా.. 2014లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2018 శాసన సభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

కాంగ్రెస్‌ను ఎందుకు వీడారు..?

2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా ఓటమిపాలయ్యాక జరిగిన నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ పదవీ కాలం ముగియకుండానే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆ పోస్టు మల్లు భట్టివిక్రమార్కకు దక్కంది.

2018 శాసన సభ ఎన్నికలు ముగిశాక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారథి మార్పు జరగింది. అప్పటికి టీపీసీసీ ఛీఫ్ గా ఉన్న ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని నిర్ణయం జరిగిత తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పదవి కోసం ప్రయత్నించారు. ఆయనతో పాటు ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా టీ పీసీసీ సారథి పోస్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంతగా ప్రయత్నించినా.. వివిధ కారణాల రీత్యా ఆ పోస్టుకు రేవంత్ రెడ్డిని ఏఐసీసీ నాయకత్వం ఎంచుకుంది. దీంతో అలిగిన కోమటిరెడ్డి సోదరులు మొదట్లో పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉండడం మొదలు పెట్టారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలకు దిగారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందంటూ ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు.

అలా కొన్నాళ్ల పాటు విమర్శలు చేస్తూ చివరకు పార్టీకి, కాంగ్రెస్ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నికలకు తెరలేపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డినా బీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

బీజేపీపై .. కినుక

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక ఆయన పెద్దగా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఒక విధంగా దూరంగా ఉంటూనే వచ్చారు. బీజేపీలో చేరి నిండా ఏడాది గడవక ముందే.. పునరాలోచనలో పడ్డారు. ఆయన బీజేపీని వీడుతారని గడిచిన మూడు నాలుగు నెలలుగా ప్రచారం జరుగుతున్నా.. ఆయన కొట్టి పారేయాలేదు. రాష్ట్రంలో అధ్యక్షుని మార్పు జరిగి బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పాక, కోమటిరెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది.

అయినా.. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పులు, బీఆర్ఎస్, బీజేపీలో లోపాయికారి ఒప్పందంలో ఉన్నాయన్న వార్తలు, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేయకపోవడం వంటి అంశాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వంపై అనుమానాలు పెంచుకున్నారు. మరో వైపు ఆయన కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగినా.. ఖండించకుండానే.. తనకైతే ఆఫర్ ఉందంటూ చెప్పుకొచ్చారు.

కొద్ది రోజుల కిందటే మునుగోడు నుంచి బీజేపీ తరపున పోటీ ఉంటానని ప్రకటించారు. తీరా జాబితా ప్రకటించే సమయానికి తనకు పోటీ చేయడం ఇష్టం లేదని, తన పేరును జాబితాలో చేర్చవద్దని కోరినట్లు సమాచారం. ఈ కారణంగానే తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరును ప్రకటించలేదని సమాచారం అందుతోంది.

తిరిగి కాంగ్రెస్ లోకే ఎందుకు ?

బీజేపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించి నిండా పది రోజులు కూడా గడవక ముందే.. పునరాలోచన ఎందుకు చేశారు..? కాంగ్రెస్ నాయకత్వంపై దుమ్మెత్తి పోసిన ఆయన తిరిగి అదే గూటికి ఎందుకు చేరాలనుకుంటున్నారు..? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కూడా రాజకీయాల ముఖ చిత్రం మారింది. బీజేపీ గ్రాఫ్ క్రమేపీ పడిపోగా.. కాంగ్రెస్ పుంజుకుంది.

ఇపుడు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇటీవల రాష్రంలో కాంగ్రెస్ కు లభిస్తున్న ఆదరణ చూశాక రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయం మార్చుకుని తిరిగి సొంత గూటికి చేరాలని అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన అధికారికంగా ఇంకా ఎక్కడా ప్రకటించకపోయినా.. ఈనెల 25వ తేదీన మునుగోడులోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. మరునాడు అంటే 26వ తేదీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులోనే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటున్నారు.

బీజేపీ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నారని తెలియగానే.. బీఆర్ఎస్ నాయకత్వం కూడా తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తూ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, బీజేపీ నాయకత్వం నుంచి కూడా ఆయనను బయటకు వెళ్లనీయకుండా ఒత్తిడి ఉందని అంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం ప్రకటిస్తారు..? కాంగ్రెస్ లో చేరి మునుగోడు నుంచి మళ్ళీ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతారా..? లేక, బీజేపీలో కొనసాగినా పోటీకి దూరంగా ఉంటారా..? అన్న ప్రశ్నలకు రెండు మూడు రోజుల్లో సమాధానం లభించనుంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

WhatsApp channel