Khammam News : 11 ఏళ్ల చిన్నారి కడుపులో వెంట్రుకలు, ఖమ్మం హాస్పిటల్ లో అరుదైన చికిత్స
Khammam News : ఖమ్మంలోని పల్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి అరుదైన ఆపరేషన్ చేశారు. బాలికకు ఆపరేషన్ చేసి సుమార్ 25 సెం.మీ పొడవు గల వెంట్రుకలను తొలగించారు.
Khammam News : ఖమ్మం (Khammam)నగరంలోని పల్స్ ఆసుపత్రిలో పదకొండేళ్ల చిన్నారికి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. బాలిక కడుపులో నెలల తరబడి పేరుకుపోయి సుమారు 25 సెంటీ మీటర్ల పొడవు, 10 సెంటీ మీటర్ల వెడల్పుతో జీర్ణాశయానికి అడ్డుగా ఉన్న వెంట్రుకలను తొలగించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అన్వర్ తెలిపిన వివరాల మేరకు.. 11 ఏళ్ల అమ్మాయి శరణీ గత కొన్ని నెలలుగా కడుపు నొప్పి(Stomach Pain)తో బాధపడుతోంది. పలు ఆసుపత్రులు తిరిగి చికిత్స తీసుకుంటున్నా.. నొప్పి మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు తమ ఆసుపత్రికి రాగా క్షుణ్ణంగా పరీక్షించి పాప వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నామన్నారు. అప్పుడప్పుడు పాప వెంట్రుకలు నోట్లో పెట్టుకుని నమలటం చూశామని చెప్పడంతో పరీక్షలు నిర్వహించగా జీర్ణకోశంలో అడ్డుందని గుర్తించామన్నారు. వెంటనే తమ సహచర వైద్యుడు ఆనంద్ గౌడ్ పాప తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి ఆపరేషన్ చేశామని చెప్పారు.
ట్రైకోఫేజియా
పాప కడుపులో దాదాపు 25 cm పొడవు 10 cm వెడల్పు చొప్పున వెంట్రుకలు చుట్టుకుని ఆహారాన్ని లోనికి పోనీయకుండా అడ్డుగా ఉన్న వెంట్రుకలు తొలగించారు. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని క్రమేపి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వెంట్రుకలు తినటం అనేది ఒక జబ్బు.. దీనిని ట్రైకోఫేజియా (Trichophagia) అంటారని డాక్టర్ అన్వర్ తెలిపారు. మానసిక సమస్యల కారణంగా ఈ జబ్బు వస్తుందని ఆయన పేర్కొన్నారు. నెలల తరబడి కడుపులో వెంట్రుకలు పేరుకుపోవడాన్ని ట్రైకోబెజర్ (trichobezoar) అంటారని వివరించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం