Khammam Politics : బీఆర్ఎస్ కు షాకిస్తున్న పొంగులేటి వర్గం, వరుసగా రాజీనామాలు!-khammam politics ponguleti srinivas reddy supporters resign to brs join in congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Politics : బీఆర్ఎస్ కు షాకిస్తున్న పొంగులేటి వర్గం, వరుసగా రాజీనామాలు!

Khammam Politics : బీఆర్ఎస్ కు షాకిస్తున్న పొంగులేటి వర్గం, వరుసగా రాజీనామాలు!

Bandaru Satyaprasad HT Telugu
Jul 01, 2023 04:08 PM IST

Khammam Politics : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Khammam Politics :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ గట్టి షాక్ తగులుతుంది. కీలక నేతలు పెద్ద ఎత్తున రాజీనామాలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి శనివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో పలువురు నాయకులు బీఆర్ఎస్‌ను వీడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 56 మంది సర్పంచ్‌లు, 26 మంది ఎంపీటీసీలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరంతా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ నిర్వహించనుంది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు.

పొంగులేటి, జూపల్లి వర్గం కాంగ్రెస్ లోకి

పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరి వెంట చాలామంది కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం సీనియర్ నేత, తెల్లం వెంకట్రావ్, తుళ్లూరి బ్రహ్మయ్య, మువ్వా విజయ్ బాబు, మేకల మల్లిబాబు యాదవ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్ కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంట వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పిడమర్తి రవి రాజీనామా

బీఆర్ఎస్‌కు ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 9 సంవత్సరాల కాలంలో ఎంతో వివక్షత అనుభవించానని ఆయన ఓ లేఖ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. దళితులను సీఎం చేస్తానన్నందుకు టీఆర్ఎస్ పార్టీలో చేరానని, కానీ దళితుడిని సీఎం చేయలేదన్నారు. దళిత డిప్యూటీ సీఎంను బర్తరఫ్ చేశారని, ఇప్పటి వరకూ బర్తరఫ్‌కు కారణం చెప్పలేదన్నారు. చివరికి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. దళితబంధు ద్వారా దళితులకు రావాల్సిన డబ్బులను ఎమ్మెల్యేలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. నాలుగు దశాబ్దాల పోరాటానికి సోనియా గాంధీ ముగింపు పలికారన్నారు. సోనియా గాంధీని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానట్లు పిడమర్తి రవి ప్రకటించారు.

Whats_app_banner