Khammam Maremma Temple : ఖమ్మం ప్రజల ఇలవేల్పుగా మారిన తమిళ దేవత "మారెమ్మ"!- అసలు కథేంటంటే?-khammam news in telugu maremma temple in city background history tamil mariamman changes to maremma ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Maremma Temple : ఖమ్మం ప్రజల ఇలవేల్పుగా మారిన తమిళ దేవత "మారెమ్మ"!- అసలు కథేంటంటే?

Khammam Maremma Temple : ఖమ్మం ప్రజల ఇలవేల్పుగా మారిన తమిళ దేవత "మారెమ్మ"!- అసలు కథేంటంటే?

HT Telugu Desk HT Telugu
Feb 20, 2024 03:36 PM IST

Khammam Maremma Temple : తమిళులు ఆరాధ దైవం మారియమ్మన్... ఖమ్మం ప్రజల ఇలవేల్పు మారెమ్మ పూజలందుకుంటుంది. ఈ తల్లిని తెలుగు ప్రజలతో పొరుగు రాష్ట్రాలు వాళ్లు సత్యమైన తల్లిగా పూజిస్తారు. మారియమ్మన్... మారెమ్మ తల్లిగా పూజలందుకోవడం వెనుక ఓ కథ ఉంది.

ఖమ్మం మారెమ్మ ఆలయం
ఖమ్మం మారెమ్మ ఆలయం

Khammam Maremma Temple : "మారెమ్మ తల్లి"..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు ఇది. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధికెక్కిన గ్రామ దేవత మారెమ్మ. ఖమ్మం నడిబొడ్డున మారెమ్మ తల్లి(Khammam Maremma Temple) కొలువుదీరడం వెనుక పెద్ద కథే ఉంది. తమిళనాడు నుంచి తరలివచ్చిన "మారియమ్మన్" అనే గ్రామ దేవత ఇక్కడ మారెమ్మ తల్లిగా పూజలు అందుకుంటోంది. అదెలాగంటే.. గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు ఖమ్మం. జిల్లాలోని తెలుగు ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల కార్మికులు ఇక్కడ పని చేస్తుంటారు. పరిశ్రమ ప్రారంభమైన తొలినాళ్లలో... అంటే, 1970లో పొరుగు రాష్ట్రాల నుంచి వలసలు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా తమిళనాడు నుంచి భారీగా కార్మికులు తరలి వచ్చేవారు. 1982లో గ్రానైట్(Granite Industry) పరిశ్రమలో పెను ప్రమాదాలు మొదలయ్యాయి. కార్మికులు తరచూ గాయాలకు గురయ్యే వారు. అనూహ్యంగా మరణాలు కూడా సంభవించేవి. ఆ కష్ట సమయంలో తమిళ కార్మికులకు తమ ఇలవేల్పు గుర్తుకొచ్చింది. ఆ తల్లి కరుణ ఉంటే విఘ్నాలను అధిగమించవచ్చని భావించారు.

yearly horoscope entry point

'మారియమ్మన్' కొలువైన వేళ

తమిళనాడు(Tamilnadu)లో గ్రామ దేవతల ప్రభావం చాలా ఎక్కువ. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడమంటూ, పిల్లాపాపలనూ, పాడి పంటలనూ రక్షించమంటూ తమిళులు 'మారియమ్మన్' అనే గ్రామ దేవతను పూజిస్తారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆ దేవతకే మొర పెట్టుకొంటారు. అయితే ఇక్కడికి తరలివచ్చిన కార్మికులు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు తమ దేవతను ఖమ్మంలో నెలకొల్పాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో 'మారియమ్మన్(Mariamman)' విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందుకు జేబీ అనే గ్రానైట్ సంస్థ చొరవ చూపింది. అలా మారియమ్మన్ తమిళ దేవత ఖమ్మంలో కొలువు దీరింది. యాదృచ్ఛికమో దైవకృపో.. ఏదైతేనేం నాటి నుంచి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కార్మికుల్లో ఆ తల్లి పట్ల విశ్వాసం పెరిగింది. గండాల నుంచి గట్టెక్కించే చల్లని వేలుపుగా, ముగురమ్మల మూలపుటమ్మగా అందరూ 'మారియమ్మన్'ను కొలవడం మొదలుపెట్టారు. స్థానిక ప్రజల్లో సైతం ఆ దేవత పట్ల గురి కుదిరింది. దీంతో భక్తుల తాకిడి ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది.

ఆలయ అభివృద్ధి

చాలాకాలం పాటు మారియమ్మన్ కు ప్రత్యేకించి ఓ ఆలయమంటూ లేదు. భక్తులు దాన్నో వెలితిగా భావించారు. 2003లో దేవాలయాన్ని నిర్మించారు. స్థానికులు కూడా వెన్నుదన్నుగా నిలవడంతో పనులు త్వరత్వరగా పూర్తయ్యాయి. ఆ తర్వాత పొరుగు జిల్లాల నుంచి భక్తుల రాక మొదలైంది. నల్లగొండ, కృష్ణా, వరంగల్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సైతం యాత్రికులు వరుస కట్టేసరికి మారియమ్మన్ దేవాలయం ప్రాచుర్యం పొందింది. ఖమ్మం మెట్టు కాస్తా ఖమ్మంగా మారినట్టు 'మారియమ్మన్' అనే పేరు కాల క్రమేణా 'మారెమ్మ'గా( Maremma Temple) రూపాంతరం చెందింది. గడచిన రెండు దశాబ్దాల కాలంగా ఈ దేవతకు 'మారెమ్మ' అన్న పేరే స్థిరపడింది. ఇదే క్రమంలో భక్తులు కోరిన కోర్కెల విషయంలో నమ్మకం పెరగడంతో, గురు, శుక్ర వారాలతో పాటు ఆదివారం దేవాలయం వద్ద ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. ఆలయం రెడ్డిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటమూ కలిసొచ్చింది. దేవాలయం వద్ద నెలకొల్పిన ఫంక్షన్ హాల్స్ లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. ఏటా సుమారు 5 వేల పెండ్లిళ్లు ఇక్కడ జరుగుతాయి.

దేవాదాయశాఖ పరిధిలోకి

మారెమ్మ తల్లి ఆలయాన్ని 2018లో దేవాదాయ శాఖ తన పరిధిలోకి తీసుకొంది. ఈ గుడికి రూ.60 లక్షల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. దేవాలయం కింద ఉన్న మరికొంత భూమిని అభివృద్ధి చేసి ఆవరణను విస్తరించాలన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. తమిళనాట గ్రామ దేవతగా కొలుచుకునే మారియమ్మన్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇక్క డికి తరలివచ్చి మారెమ్మ తల్లిగా( Maremma Goddess) పేరు పొందడం విశేషమే. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పల్లెలోనూ మారెమ్మ గుడి ఉంటుంది. ఇక్కడ మాత్రం మారియమ్మన్.. మారెమ్మగా మారడం ఆసక్తికరమైన విషయం.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

Whats_app_banner

సంబంధిత కథనం