Bhogi Festival : భోగి మంట విశిష్టత ఏంటి? ఆ మంటల్లో ఏం వేయకూడదు?-khammam news in telugu bhogi bonfire importance which do not throw in fire ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhogi Festival : భోగి మంట విశిష్టత ఏంటి? ఆ మంటల్లో ఏం వేయకూడదు?

Bhogi Festival : భోగి మంట విశిష్టత ఏంటి? ఆ మంటల్లో ఏం వేయకూడదు?

HT Telugu Desk HT Telugu
Jan 13, 2024 02:40 PM IST

Bhogi Festival : భోగి పండుగ నాడు ఊరూవాడ... భోగి మంటలు వేస్తుంటారు. ఇంట్లోని పాత వస్తువులను, పాత కలపను ఈ మంటల్లో వేస్తారు. అయితే అసలు భోగి మంటకు ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

భోగి మంటలు
భోగి మంటలు

Bhogi Festival : సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఆ రోజు చలి తార స్థాయిలో ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగి నాటికి ఉద్ధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది. కనుక భోగి మంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతి నాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనక మరో విశేషం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వల్ల ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాల్లోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగి మంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది.

అగ్నిని ఆరాధించే సందర్భం కూడా

భోగి మంటలు అంటే కేవలం చలి మంటలు కాదు. అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిదంటారు.

మంటల్లో ఏం వేయాలంటే..

ఇక భోగిమంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు, ఆవు నెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. కానీ కాలం మారింది. రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని కూడా భోగి మంటల్లో వేస్తున్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి ఇంధనాలని వాడేస్తున్నారు. ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో గానీ, ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్‌ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణమూ కలుషితం కావడం ఖాయం. మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతో భోగి మంటలు వేసుకోవాలన్నది పెద్దల మాట. అలా నలుగురికీ వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్నీ అందించే భోగి మంటలు వేసుకోవాలా? లేకపోతే నాలుగు కాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సంప్రదాయాన్ని ‘మంట’ కలపాలా..? అన్నది మనమే నిర్ణయించుకోవాలి.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

Whats_app_banner