Telugu News  /  Telangana  /  Kcr May Anounce National Party On Vijaya Dasami
విజయదశమి రోజు జాతీయ పార్టీ ప్రకటించనున్న కేసీఆర్
విజయదశమి రోజు జాతీయ పార్టీ ప్రకటించనున్న కేసీఆర్ (twitter)

KCR BRS Party : విజయదశమి రోజు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ ఎంట్రీ…..

30 September 2022, 9:32 ISTHT Telugu Desk
30 September 2022, 9:32 IST

KCR BRS Party తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఖరారైంది. విజయదశమి రోజు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ‌ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో నేడు యాదాద్రి క్షేత్రాన్ని కేసీఆర్ దంపతులు దర్శించుకోనున్నారు. యాదాద్రి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం చేయించేందుకు కేసీఆర్‌ ఒక కేజీ 16 తులాల బంగారాన్ని ఆలయానికి అందచేయనున్నారు.

KCR BRS Party విజయదశమి రోజు జాతీయ పార్టీ ప్రకటన చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సన్నద్ధమవుతున్నారు. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లనూ కేసీఆర్‌ వేగవంతం చేశారు. అందుకు సంబంధించిన పత్రాలపై దసరా పండుగనాడే ఆయన సంతకాలు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఆ పత్రాలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచి, ముగ్గురు నలుగురు నాయకులకు మాత్రమే చెప్పిన కేసీఆర్‌, దసరా దగ్గర పడుతుండడంతో మరికొందరు కీలక నేతలకు కూడా ఈ విషయాన్ని స్వయంగా తెలియచేశారు.

ట్రెండింగ్ వార్తలు

కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆరే KCR ఉండనున్నారు. ఆ హోదాలోనే ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పత్రాలు సమర్పించనున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందు యాదగిరిగుట్ట నరసింహస్వామి, వరంగల్‌ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులను కేసీఆర్‌ తీసుకోనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు యాదగిరిగుట్ట వెళ్తారు.

యాదాద్రి Yadadri గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు గతంలో ప్రకటించిన కిలో పదహారు తులాల బంగారాన్ని అందజేసి, మొక్కు చెల్లించుకుంటారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను స్వామివారి ముందు ఉంచి ఆశీర్వాదం పొందనున్నారు. ప్రగతి భవన్‌ నుంచి యాదాద్రికి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. మధ్యాహ్నం అక్కడినుంచి బయల్దేరి ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. శనివారం వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. వరంగల్‌‌లో నిర్మించిన మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రారంభిస్తారు.

జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత ఆ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన లాంఛనాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత తొలి బహిరంగ సభను కరీంనగర్‌ (karim nagar )లో ఏర్పాటుచేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా కేసీఆర్‌ తొలి బహిరంగ సభను కరీంనగర్‌లోనే నిర్వహించారు. పార్టీ ఏర్పాటు ప్రకటనను జలదృశ్యంలో చేసినా బహిరంగ సభను మాత్రం కరీంనగర్‌లో నిర్వహించారు. అదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా తొలి బహిరంగ సభను కరీంనగర్‌లోనే నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. బహిరంగ సభలో పార్టీకి సంబంధించిన విధి, విధానాలు, అజెండా తదితర అంశాలను ప్రజల ముందు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కూడా ఒక బహిరంగ సభను నిర్వహించి, కలిసొచ్చే పార్టీలను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దసరా రోజున దీనిపై నిర్ణయాలను తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

కొత్త పార్టీ పేరు బిఆర్‌ఎస్‌….

కేసీఆర్‌ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ BRS అని పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌‌కు దగ్గరగా ఉండేలా బిఆర్‌ఎస్‌ పేరును ఖరారు చేశారు. మరోవైపు మహారాష్ట్ర మాజీ ఎంపీ, లోక్‌మత్‌ మీడియా సంస్థల చైర్మన్‌ విజయ్‌ దర్డా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో గురువారం కలిశారు. మూడు గంటలభేటీలో.. జాతీయ రాజకీయాలు, మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై చర్చ జరిగినట్టు సమాచారం. తాను జాతీయ పార్టీ పెడుతున్న విషయాన్ని ఆయనకు తెలిపిన కేసీఆర్‌.. మహారాష్ట్రలో తమకు మద్దతివ్వాల్సిందిగా ఆయన్ను కోరినట్టు తెలిసింది. తాను రచించిన ‘రింగ్‌ సైడ్‌ ’ పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు విజయ్‌ దర్డా బహూకరించారు.కేసీఆర్‌ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని మహారాష్ట్ర రాజ్యసభ మాజీ సభ్యుడు, 'లోక్‌మత్‌' మీడియా సంస్థల ఛైర్మన్‌ విజయ్‌ దర్దా అన్నారు.

కేసీఆర్‌ కోసం ప్రత్యేక విమానం….

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ గురువారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త ప‌ర్య‌ట‌న‌ల కోసం ప్ర‌త్యేకంగా ఓ చార్టెర్డ్ ఫ్లైట్ (నుగోలు చేయాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. ఇందుకోసం ఏకంగా రూ.80 కోట్ల‌ను వెచ్చించేందుకు ఆ పార్టీ సిద్ధ‌ప‌డింది. 12 సీట్ల‌తో కూడిన ఈ విమానం కోనుగోలుకు సంబంధించి ద‌స‌రా ప‌ర్వ‌దినాన ఆర్డ‌ర్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిర్ణ‌యించింది. టిఆర్‌ఎస్‌ పార్టీ విమానాన్ని కొనుగోలు చేస్తే సొంత విమానం క‌లిగిన రాజ‌కీయ పార్టీగా టీఆర్ఎస్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్క‌నుంది. పార్టీ అధినేత దేశవ్యాప్త పర్యటనల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారుు. పార్టీలోని పది మంది కీలక నాయకులు ఈ విమానం కొనుగోలు కోసం విరాళాలు ఇచ్చారు.