Bandi Sanjay : కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది - బండి సంజయ్
Bandi Sanjay : వచ్చే ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధిలో తన మార్క్ చూపిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదన్నారు. అన్ని పార్టీల నేతలను కలుపుకుని కరీంనగర్ ను అభివృద్ధి చేస్తానన్నారు.
Bandi Sanjay : రాబోయే ఐదేళ్లలో కరీంనగర్ లో తన మార్క్ చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం, కార్పొరేటర్ల సహకారంతో కరీంనగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. పేరు కోసం పనిచేయడం కాకుండా నాకు జన్మనిచ్చిన ఈ గడ్డ కోసం అభివృద్ధి చేస్తానని చెప్పారు. స్మార్ట్ సిటీ మిషన్ పొడిగింపు సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై.సునీల్ రావు ఆధ్వర్యంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను సన్మానించారు. బండి సంజయ్ తో తమకున్న అనుబంధాన్ని పలువురు కార్పొరేటర్లు గుర్తు చేసుకున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన నేపథ్యంలో బండి సంజయ్ పడిన కష్టాలను, చేసిన పోరాటాలను ప్రస్తావించారు. తమతో కలిసి కార్పొరేటర్ గా పనిచేసిన సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడం గర్వకారణమన్నారు. కేంద్రంతో మాట్లాడి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావాలని కోరారు.
కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత నాదని బండి సంజయ్ హామీ ఇచ్చారు. జన్మనిచ్చి నన్ను ఇంత వాడిని చేసిన కరీంనగర్ ను అద్భుతంగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకునేందుకు కసితో పనిచేస్తున్నట్లు చెప్పారు. గతంలో కేంద్రంలో నన్ను గుర్తుపట్టేవాళ్లు కారని, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక దేశవ్యాప్తంగా ప్రముఖులు, కేంద్ర మంత్రులు గుర్తు పడుతూ చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని చెబుతున్నారని తెలిపారు. పేరు కోసమో, మీడియా కోసమో కాకుండా ప్రజల కోసం చర్చించండి... ప్రణాళిక రూపొందించండి... ప్రజలకు మంచి మెసేజ్ వెళ్లేలా మాట్లాడండి... ఆ ప్రణాళిక అమలు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లను కలిసి చర్చించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.
కేంద్రం నిధులు తీసుకువచ్చే బాధ్యత నాదే
అమృత్ 1 కింద రూ.132 కోట్లు వచ్చాయని అందులో కేంద్రం వాటా రూ.66 కోట్లు. ఆ నిధులవల్లనే నిరంతరం నీళ్లు ఇవ్వగలుగుతున్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మధ్య అమృత్ 2 కింద మరో రూ.147 కోట్లు మంజూరైతే, కేంద్రం తన వాటా కింద 73.5 కోట్లను ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం రూ.934 కోట్లు మంజూరైతే.... అందులో రూ.765 కోట్లు ఇప్పటికే వచ్చాయని ఇంకా రూ.176 కోట్లు రావాల్సి ఉందన్నారు. అందులో స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.100 కోట్ల దాకా రావాల్సి ఉందని తెలిపారు. కేంద్రం నుంచి రూ.70 కోట్లు వస్తాయని, కేంద్రం నుంచి ఆ నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
నెత్తుటితో అభిమాననేత చిత్రపటం
అభిమానం రక్తాన్ని చిందించింది. రక్తంతో చిత్రపటాన్ని తయారు చేసి అభిమాన నేతకు బహుకరించే పరిస్థితి కరీంనగర్ లో ఏర్పడింది. గల్లీ నుంచి దిల్లీ స్థాయికి ఎదిగిన అభిమాన నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వెరైటీగా శుభాకాంక్షలు తెలపాలని సంకల్పించిన కరీంనగర్ కు చెందిన అభిమాని ఏకంగా తన రక్తంతో చిత్రపటాన్ని తయారు చేయించి బహుకరించారు. కరీంనగర్ కట్టరాంపూర్ కు చెందిన బండి సంజయ్ వీరాభిమాని వెంకటేష్ తన రక్తంతో చిత్రాన్ని వేయించి బహుకరించారు. తనకు బండి సంజయ్ అంటే చాలా అభిమానమని అందుకే కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారి బండి సంజయ్ ని కలుస్తున్న సందర్భంగా కొత్తగా ఏదైనా ఇవ్వాలని భావించి తన రక్తంతో చిత్రపటాన్ని తయారు చేయించి బహూకరించానని తెలిపారు. వీరాభిమాని వెంకటేష్ ను పలువురు అభినందించగా బండి సంజయ్ మాత్రం రక్తాన్ని చిందించే అభిమానం తనకు వద్దని సూచించారు. అభిమానం హృదయంలో ఉండాలి కానీ ఇలా రక్తాన్ని చిందించేలా ఉండకూడదన్నారు.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం