జగత్ కే నాధుడు జగన్నాథుడు... ఆ దేవుడే భక్తుల వద్దకు రావడం అదృష్టంగా భావిస్తాం.. ఇప్పుడు ఒ అదృష్టం కరీంనగర్ ప్రజలకు దక్కబోతుంది. పూరి జగన్నాథుని రథం ఈనెల 15న కరీంనగర్ కు రానున్నది.
జగన్నాథుని రథోత్సవం సందర్భంగా కరీంనగర్ కళాభారతి వద్ద ఇసుక రేణువులతో ఏర్పాటు చేసిన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుడి సైకత శిల్పాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక పూజలతో ఆవిష్కరించారు. సకల జగత్తుకే నాధుడు జగన్నాథుడని, ఆ స్వామికి మనమందరం కుటుంబ సభ్యులమని కలెక్టర్ అన్నారు. జగన్నాథుడి వద్దకు మనం వెళ్లలేకపోయినా, ఆ స్వామి భక్తుల వద్దకు రావడం అదృష్టమని పేర్కొన్నారు.
జూలై 15న సోమవారం కరీంనగర్లో నిర్వహించనున్న జగన్నాధ రథయాత్రకు ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ కు జగన్నాథుడు రావడం అంటే గొప్ప మహా శక్తి దాగి ఉందని పేర్కొన్నారు. జగన్నాధుని బోధనలను అనుసరిస్తూ ప్రజలంతా సన్మార్గంలో పయనించాలని సూచించారు. ఒరిస్సా లో ఉన్న పూరి జగన్నాథ్ కు గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. దేవుడు అందరికీ సమానమని ఆ స్వామి నిరూపించారని చెప్పారు.
ఆదివాసీ అడవిలో నిత్యపూజలు అందుకునే పూరి జగన్నాథునికి ముస్లీం భక్తులు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. సాలె బేగం అనే ముస్లిం భక్తుడు ఉండేవారని, అతడికి జగన్నాథ స్వామి అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. సాలె బేగం ఆ స్వామి దర్శనం చేసుకునేందుకు ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని తెలిపారు.
ఒకసారి స్వామివారి రథోత్సవం సందర్భంగా రథం ముందుకు వెళ్లలేక వెనక్కు వెళ్లిపోయిందని పేర్కొన్నారు. దీంతో సాలె భేగం స్వామి వారి దర్శనం చేసుకున్నాక రథం ముందు కదిలిందని తెలిపారు. జగన్నాథుడిపై అంత గొప్ప భక్తుడిగా మారిన ముస్లిం కులానికి చెందిన సాలే బేగం భక్తి భావం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాంటి భక్తి భావం ఉన్న వ్యక్తిని ఇంత వరకు మనం చూడలేదని తెలిపారు. అన్నీ ఉన్న దేవుడు జగన్నాధుడేనని కలెక్టర్ తెలిపారు.
ఈనెల 15న కరీంనగర్ పురవీధుల గుండా సాగే జగన్నాథుడి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రథయాత్ర నిర్వాహకులు నరహరి ప్రభుజీ కోరారు. రథయాత్ర ద్వారా స్వామి వారిని దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్, రథయాత్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎల్.రాజాభాస్కర్ రెడ్డి, చైర్మన్ కన్న కృష్ణ, కో చైర్మన్, కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.