TGSRTC : ఆర్టీసీకి పండుగ, ప్రయాణికుల రద్దీతో పెరిగిన ఆదాయం-karimnagar tgsrtc buses occupancy rate increases on festival along with income ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc : ఆర్టీసీకి పండుగ, ప్రయాణికుల రద్దీతో పెరిగిన ఆదాయం

TGSRTC : ఆర్టీసీకి పండుగ, ప్రయాణికుల రద్దీతో పెరిగిన ఆదాయం

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 08:30 PM IST

TGSRTC : మహిళల ఉచిత ప్రయాణంతో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో పండుగల వేళ ఆదాయం పెరుగుతోంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ లో రూ.12.34 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఆర్టీసీకి పండుగ, ప్రయాణికుల రద్దీతో పెరిగిన ఆదాయం
ఆర్టీసీకి పండుగ, ప్రయాణికుల రద్దీతో పెరిగిన ఆదాయం

TGSRTC : ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన తెలంగాణ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. తద్వారా పండుగ వేళల్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి భారీగా ఆదాయం సమకూరుతుంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో రూ. 12 కోట్ల 34 లక్షల ఆదాయం లభించింది. రక్షాబంధన్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోలు తమ లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయాన్ని ఆర్జించాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారు.

4 రోజుల్లో...రూ.12.34 కోట్లు ఆదాయం

రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నుంచి జేబీఎస్ తోపాటు పలు ప్రాంతాలకు అదనపు సర్వీసులు నడిపించారు. ఈనెల 17 నుంచి 20 వరకు 3508 బస్సులు 10524 ట్రిప్పుల ద్వారా 16.05 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. మొత్తం 22.11 లక్షల మంది ప్రయాణించగా రూ.12.34 కోట్ల ఆదాయం (మహాలక్ష్మి పథకం వాటా రూ.6.76 కోట్లు) ఆదాయం సమకూరింది. పండగ రోజు 6.37 లక్షల మంది ప్రయాణించగా ఇందులో 4.65 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. ఆ ఒక్కరోజే రూ.3.56 కోట్ల ఆదాయం రాగా ఓఆర్ 119 శాతంగా నమోదైంది. మరోవైపు గోదావరిఖని డిపో రికార్డు స్థాయిలో 3.52 లక్షల మంది ప్రయాణికులను తరలించి రూ.2.12 కోట్ల ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచింది. జగిత్యాల డిపో 3.07 మంది ప్రయాణికులు రూ.1.60 కోట్ల ఆదాయం, కరీంనగర్-2 డిపో 2.30 లక్షల మంది ప్రయాణికులు రూ.1 38 కోట్ల ఆదాయంతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులు..

ప్రయాణికుల రద్దీని ఊహించిన అధికారులు.. రీజియన్‌ పరిదిలో అందుకు తగిన ప్రణాళికతో ముందుకు సాగారు. డిప్యూటీ ఆర్ఎంలు, అన్ని డిపోల మేనేజర్లు, ఇతర సిబ్బందితో రీజినల్ మేనేజర్ ఎస్. సుచరిత సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జేబీఎస్ తోపాటు రీజియన్లోని అన్ని డిపోల్లో అధికారులు, సిబ్బంది బస్టాండ్లలోనే మకాం వేసి రద్దీకి అనుగుణంగా బస్సులు నడిచేలా చూశారు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో మొత్తం 860 బస్సులు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైనే పరుగులు పెట్టాయి. అదనపు ట్రిప్పులను నడిపిస్తూనే.. హైదరాబాద్ తోపాటు ఇతర డిపోల బస్సులనూ తెప్పించి నడిపించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు, సిబ్బంది తమ సెలవులను పక్కన పెట్టి విధి నిర్వహణలో భాగస్వాములయ్యారు.

అందరి కృషితో

రాఖీ పండగకు అనుకున్నకున్న దానికంటే ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. డ్రైవర్లు, కండక్టర్లు స్పెషల్ ఆఫ్ లు వద్దని పనిచేశారు. ముఖ్యంగా మహిళా కండక్టర్లు పండగ అని చూడకుండా విధులు నిర్వహించారు. అధికారులు, సిబ్బంది సమష్టి సహకారంతోనే విజయవంతంగా ముందుకు సాగామని అనుకున్న లక్ష్యాన్ని కంటే ఎక్కువ ఆదాయం పొందామని ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. నాలుగు రోజుల్లో 12 కోట్ల పైగా ఆదాయం రావడంతో ఆర్టీసీ లో నూతనోత్సాహం నెలకొంది.

పండుగప్పుడే కాదు... రద్దీకి అనుగుణంగా బస్సులు..

పండుగ వేళల్లోనే కాకుండా మామూలు రోజుల్లో సైతం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీస్ లను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. మొన్న జగిత్యాల వద్ద, నిన్న హుజురాబాద్ లో ప్రయాణికుల రద్దీ... ఓవర్ లోడ్ తో బస్సులు ఆగిపోయిన సంఘటనలు పునరావృతం కాకుండా బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.‌ నిర్మల్ డిపోకు చెందిన బస్సు జగిత్యాల నుంచి నిర్మల్ కు బయలుదేరగా 50 మంది ప్రయాణికుల కెపాసిటీ గల బస్సులో 170 మంది ఎక్కడంతో మోరపల్లి వద్ద ఓవర్ లోడ్ తో బస్సు వెనుకాల రెండు టైర్లు ఊడి పోయి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అదేవిధంగా నిన్న హుజురాబాద్ లో 55 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ గల బస్సులో 110 మంది ఎక్కడంతో డ్రైవర్ రోడ్డు పైనే బస్సు నిలిపివేశాడు. ఓవర్ లోడుతో బస్సులు నడపాలంటే కష్టమని, ఇలా అయితే బస్సులు నడపలేమని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు తోపాటు డ్రైవర్ లు డిమాండ్ చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం