RTC Electric Super Luxury Buses : పర్యావరణహితం కోసం ఆర్టీసీ ఖర్చును తగ్గించుకునేందుకు ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో తెస్తుంది. కరీంనగర్ రీజియన్ కు కేటాయించిన 70 బస్సులను జెబిఎం ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు ఎక్కించే ముహూర్తం ఖరారు చేసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులు చేతుల మీదుగా 35 బస్సులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్ నుంచి ఈ బస్సులను ప్రారంభిస్తున్నారు. కరీంనగర్-2 డిపోకు కేటాయించిన 35 సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభిస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని కరీంనగర్ ఆర్ఎం సుచరిత తెలిపారు.
కరీంనగర్ రీజియన్ పరిధిలో 70 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు నడుపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం ఆర్టీసీ ఆరు డిపోలను ఎంపిక చేసింది. తెలంగాణలోని కరీంనగర్-2 డిపో, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సూర్యపేట, హైదరాబాద్-2 డిపోలను ప్రైవేట్ మేనేజ్మెంట్ కు అద్దెకు ఇచ్చి ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు మేజర్స్ జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణికుల కోసం అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ వీటిని అద్దె ప్రాతిపదికన నడపనున్నారు. డ్రైవర్ తోపాటు ఇతర నిర్వహణ మొత్తం జేబీఎం సంస్థే చూసుకుంటుండగా ఆర్టీసీ మాత్రం కండక్టర్ల పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. ఎలక్ట్రికల్ బస్సులు రహదారిపై పరుగులు తీయడానికి అవసరమైన ఏర్పాట్లను టీజీఎస్ఆర్టీసీ పూర్తి చేసింది.
తొలివిడతగా ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్-2 డిపో కేంద్రంగా నడుపుతారు. ఇందుకోసం డిపో ఆవరణలో అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా 11 కేవీ విద్యుత్ లైన్, 14 ఛార్జింగ్ పాయింట్లు, మూడు ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్లు బిగించారు. మొదటి విడతలో వచ్చిన బస్సుల్లో 33 బస్సులను కేవలం జేబీఎస్ కు మాత్రమే నడపనున్నారు. రెండు బస్సులు స్పేర్ గా ఉంచుతారు. రెండో విడతలో కరీంనగర్ నుంచి జేబీఎస్ కు 39, గోదావరిఖని 9, మంథని 4, కామారెడ్డి 6, రాజన్న సిరిసిల్ల 6, జగిత్యాలకు 6 బస్సులను నడపనున్నారు. మరో 4 డీలక్స్ బస్సులు వచ్చినా వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం