Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన - చనిపోయిన మిత్రుడి ఖాతా నుంచి రూ. 20 లక్షలు కాజేశాడు
కరీంనగర్ లో సరికొత్త మోసం వెలుగు చూసింది. మృతి చెందిన స్నేహితుడి ఖాతా నుంచి 20 లక్షలను కాజేశాడు ఓ ఘనుడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు… కేసును చేధించారు. కేసులో ఉన్న అసలు సూత్రదారి పరారీలో ఉన్నాడు. సాంకేతికంగా సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
స్నేహానికన్నా మిన్నా... లోకాన లేదురా...అంటారు. కానీ కరీంనగర్ ఓ ప్రబుద్ధుడు మిత్ర ద్రోహిగా మారాడు. ఓకే డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ నమ్మకంగా మెదిలి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.
రిటైర్డ్ అయి మృతి చెందిన మిత్రుడి ఫోన్ నెంబర్ రద్దు చేయించి తన పేరిట ఆ సిమ్ కార్డు పొందాడు. తనకు తెలిసిన మరో మిత్రుడితో మృతి చెందిన స్నేహితుడి బ్యాంక్ ఖాతా నుంచి 20 లక్షలు కాజేశాడు. అతను ప్రస్తుతం పరారీలో ఉండగా అందుకు సహకరించి మరొకరిని కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
కరీంనగర్ లోని నీటిపారుదల శాఖలో ఎండి సమీయుద్దీన్ సూపరింటెండెంట్ గా పని చేసి 2013లో ఉద్యోగ విరమణ పొందారు. అతడు అవివాహితుడు. సమీయుద్దీన్ ఇద్దరు చెల్లెళ్ళు ఉండగా వారికి వివాహం కాలేదు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత సమీయుద్దీన్ తనకు వచ్చిన డబ్బులో కొంత బ్యాంకు ఖాతాలో, మరికొంత నగదును తన సోదరి సబీహా సుల్తానా బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
సమీయుద్దీన్ పని చేస్తున్న నీటిపారుదల శాఖలోనే పని చేసే జూనియర్ అసిస్టెంట్ జహంగీర్ సమీయుద్దీన్ తో స్నేహితుడిగా మెదిలాడు. మిత్రుత్వంతో రెండు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. అంతవరకు బాగానే ఉంది. సమీయుద్దీన్ మృతితో ఆయన ఖాతాలో ఉన్న డబ్బుపై జహంగీర్ కన్ను పడింది.
డబ్బులు మాయం చేసి...!
సమీయుద్దీన్ 2022లో మృతి చెందారు. అతడి బ్యాంకు ఖాతా, తన సోదరి సబీహా సుల్తానా బ్యాంకు ఖాతాల వివరాలు జహంగీర్ తెలుసుకున్నాడు. మూడు నెలల కింద కరీంనగర్ లో జిమ్ నిర్వాహకుడైన మహ్మద్ ఆసిఫ్ పాషాకు విషయం తెలిపి అతడితో చేతులు కలిపాడు.
సమీయుద్దీన్ వినియోగించిన ఫోన్ నంబర్ ను ఆసిఫ్ పాషా రద్దు చేయించి తన పేరు మీదకు మార్చుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో సమీయుద్దీన్, సబీహా సుల్తానా బ్యాంకు ఖాతాల్లో ఎంత నగదు ఉందో తెలుసుకున్నారు. సబీహా సుల్తానా బ్యాంక్ ఖాతాలో నిల్వ ఉన్న 20 లక్షల 18 వేల 557 రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. అవసరాల మేరకు యూపీఐ ద్వారా విడుతల వారీగా 20 లక్షల మేర మళ్లించుకున్నారు. నెల కింద సబీహా సుల్తానా బ్యాంకు వెళ్లి లక్ష డ్రా చేసుకున్నారు. మిగతా నిల్వ ఉన్న నగదుపై విచారించగా ఖాతాలో డబ్బులు లేనట్లు తెలిసింది. దీంతో ఆమె కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏసీపీ నరసింహారెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు.
సూత్రదారి పరార్…..
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసును ఛేదించారు. నేరంలో కీలకపాత్ర పోషించిన ఆసిఫ్ పాషాను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 18 లక్షలు రికవరీ చేశారు. సూత్రదారి జహంగీర్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ నరసింహారెడ్డి తెలిపారు. స్నేహితుడిగా మెదిలి మిత్రుడి బ్యాంక్ ఖాతాకే కన్నం వేయించిన జహంగీర్ పరారీలో ఉండగా అతనికి సాంకేతిక పరంగా సహకరించిన ఆసిఫ్ పాషాను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు.
ఏటిఎంలో స్టీల్ ప్లేట్ అమర్చి చోరీ:
దొంగలు రూట్ మార్చారు.. సరికొత్త పద్దతిలో ఏటిఎంలో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కారు. కరీంనగర్ బస్టాండ్ వద్ద ఎస్బిఐ ఏటీఎంలో డబ్బులు వచ్చే చోట లోపల స్టీల్ ప్లేట్ అమర్చి రూ.10 వేలు చోరీ చేశారు. వినియోగదారులు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు పిన్ నంబర్ ఎంటర్ చేయగానే డబ్బులు మిషన్ నుంచి వచ్చే చోట స్టీల్ ప్లేట్ అమర్చడంతో ఎవరైనా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తే డబ్బులు రాకపోవడంతో వెళ్ళిపోతారు. అయితే అప్పటికే నగదు వచ్చి ఆ స్టీల్ ప్లేట్లో పడుతుంది.
వినియోగదారులు వెళ్లిపోగానే దొంగలు వచ్చి, స్టీల్ ప్లేట్లోని నగదుతో ఉడాయిస్తుంటారు. రెండు రోజుల క్రితం కరీంనగర్ బస్టాండ్ ఏటీఎంలో భిక్షపతి 10 వేలు డ్రా చేయగా డబ్బులు రాలేదు. డబ్బులు అకౌంట్ నుంచి కట్ అయ్యాయి...కానీ మిషన్ నుంచి ఆయనకు డబ్బులు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు విచారణ చేపట్టగా ఇద్దరు వ్యక్తులు డబ్బులు తీసుకున్నట్లు గుర్తించి నిఘా పెట్టగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రోహిత్ పాల్, సత్యవీర్ సింగ్ పట్టుబడ్డారు. ఆ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు అంతర్ రాష్ట్ర ముఠా సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో నలుగురు వ్యక్తులు కలిసి ఈ తరహా చోరీ చేసినట్లు తెలిసింది.