ACB Arrested Sub Registrar : భూమి రిజిస్ట్రేషన్ కు రూ.10 వేల లంచం, ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
ACB Arrested Sub Registrar : తెలంగాణలో ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. లంచాలు అడిగిన అధికారులకు కటకటాల వెనక్కి పంపుతుంది. తాజాగా గంగాధరలో రూ.10 వేల లంచం తీసుకుంటూ ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు.

ACB Arrested Sub Registrar : కరీంనగర్ జిల్లా(Karimnagar District) గంగాధర ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్(Sub Registrar) సురేష్ బాబు ఏసీబీకి చిక్కారు. గిఫ్ట్ డీడ్ ద్వారా భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.10 వేలు లంచం(Bribe)గా తీసుకుంటుండడగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రేకుర్తికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు అజయ్ కుమార్ కు అతని తండ్రి ద్వారా గిఫ్ట్ గా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ (Land Registration)చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ రూ. 10 వేలు డిమాండ్ చేశారు. దీంతో అంజయ్య ఏసీబీ(ACB) అధికారులను ఆశ్రయించాడు. శనివారం ఆఫీసు సబార్డినేట్ కొత్తకొండ శ్రీధర్ ద్వారా పదివేలు తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తీసుకోమంటేనే తీసుకున్నానని శ్రీధర్ తెలుపడంతో ఏసీబీ అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్
లంచం(Bribe) తీసుకునే అధికారులు మరొకరి ద్వారా డబ్బులు తీసుకునే ప్రక్రియ మొదలు పెట్టడంతో అనామకులు బలవుతున్నారు. పెద్ద సారే దగ్గర అయ్యాడన్న ధీమాతో లంచం తీసుకునేందుకు సాహసిస్తే కటకటాల పాలుకాక తప్పడం లేదు. గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ (Sub Registration office)కార్యాలయంలో శనివారం ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ సురేష్ కోసం లంచం డబ్బులు తీసుకుంటూ ఔట్ సోర్సింగ్(Out Sourcing Employee) ఉద్యోగి శ్రీధర్ కూడా కేసులో ఇరుక్కున్నాడు. కుటుంబ పోషణ కోసం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగం చేస్తున్న నిరుద్యోగులు అధికారుల కనుసన్నల్లో దారి తప్పుతుండడమే వారి పాలిట శాపంగా మారింది. ఏసీబీ కేసు క్లోజ్ అయ్యే వరకూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తయారు కాగా వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడక తప్పడం లేదు.
మొన్న తస్లీమా...నేడు సురేష్
సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతి అధికారులకు అడ్డాలుగా మారాయి. ఇటీవల మహబూబాబాద్ లో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా(Sub Registrar Taslima) ఏసీబీకి చిక్కగా సోదాల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఆ సంఘటన మరిచిపోక ముందే తాజాగా గంగాధర లో ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కడం కలకలం సృష్టిస్తుంది. చేతికి అవినీతి మరక అంటకుండా సురేష్ బాబు జాగ్రత్త పడ్డా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు. ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చాక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు తహశీల్దార్ కార్యాలయంలోనే జరుగుతుండగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం తగ్గింది. హౌస్ సైట్స్ మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలో రిజిస్ట్రేషన్ జరుగుతుండగా అందుకోసం వచ్చిన వారి నుంచి అందినకాడికి దండుకునే పనిలో సబ్ రిజిస్ట్రార్ లు ఉన్నారు. అందులో భాగంగానే మొన్న తస్లీమా నస్రీన్, నేడు సురేష్ బాబు ఏసీబీకి చిక్కినట్లు తెలుస్తుంది.
రూ.4 లక్షల లంచం
రూ.4 లక్షల లంచం(Bribe) తీసుకుంటూ నీటిపారుదల శాఖ, బుద్ద భవన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) యాత పవన్ కుమార్ ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 (ACB Telangna Toll Free No)కి కాల్ చేయమని ఏసీబీ అధికారులు తెలిపారు.
HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం