ACB Trap in Hyderabad : తెలంగాణ ఏసీబీ దూకుడు - రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్
Telangana ACB Latest News: హైదరాబాద్ లో రూ. 50 వేలు లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దొరికిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ… పక్కాగా ప్లాన్ చేసి అరెస్ట్ చేసింది.
Telangana ACB Latest News: గత కొంతకాలంగా తెలంగాణ ఏసీబీ(Telangana ACB) దూకుడు పెంచింది. ప్రతిరోజూ ఏదో ఒక చోట అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నారు. చిన్నస్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి ఉద్యోగి వరకు కూడా ఇందులో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని పని చేస్తున్న ఓ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా… ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది ఏసీబీ.
మాసబ్ ట్యాంక్ లోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో జగన్మోహన్... టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే జితేంద్ర రెడ్డి అనే వ్యక్తి ఎల్బీ నగర్ పరిధిలోని చింతల్ కుంట సమీపంలో బిల్డింగ్ నిర్మాణం చేపట్టాడు. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు అతని వద్ద నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. దీంతో జితేంద్ర రెడ్డి... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అడిగిన మేర రూ. 50 వేలు ఇచ్చేలా ముందుస్తు ప్లాన్ చేయగా... ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. రూ. 50 వేలు తీసుకుంటుండగా జగన్మోహన్ ను అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇటీవలే కాలంలో ఏసీబీ అధికారులు…. విస్తృతంగా దాడులు చేస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో… నేరుగా రంగంలోకి దిగేస్తున్నారు. ఇటీవలే మీర్ పేట పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ ఎస్ఐని కూడా అరెస్ట్ చేసింది ఏసీబీ. పది వేలు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇక మార్చి నెలలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు జరిగాయి. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో శుక్రవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రైడ్ చేసి లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ తో(Sub registrar Tasleema) పాటు ఆఫీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇలా ఒక్క డిపార్ట్ మెంట్ కాదు… దాదాపు అన్నిశాఖల్లోనూ పని చేస్తున్న పలువురు సిబ్బంది భారీగా పట్టుబడుతున్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే… 1064 ఫోన్ నెంబరను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రచారం చేస్తున్నారు.