Independence Day 2022 : గాంధీ మహాత్ముడు భాగ్యనగరంలో ఖైదీగా ఉన్న పోలీస్ స్టేషన్ ఎక్కడంటే?-independence day 2022 special mahatma was kept prisoner in bollaram police station at the time of quit india movement
Telugu News  /  Telangana  /  Independence Day 2022 Special Mahatma Was Kept Prisoner In Bollaram Police Station At The Time Of Quit India Movement
అప్పటి బొల్లారం పోలీస్ స్టేషన్(ఫైల్ ఫొటో)
అప్పటి బొల్లారం పోలీస్ స్టేషన్(ఫైల్ ఫొటో)

Independence Day 2022 : గాంధీ మహాత్ముడు భాగ్యనగరంలో ఖైదీగా ఉన్న పోలీస్ స్టేషన్ ఎక్కడంటే?

14 August 2022, 16:34 ISTAnand Sai
14 August 2022, 16:34 IST

దేశమంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకొంటోంది. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది అమరుల ప్రాణాలే నేటి మన స్వతంత్ర భారతం. వాళ్లలో మహాత్మా గాంధీ జీవితానిది ప్రత్యేక స్థానం. ఆయన హైదరాబాద్ లోనూ ఖైదీగా ఉన్నారనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆ స్టేషన్ ఏదీ అని తెలుసుకోవాలని ఉందా?

స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమానిది ప్రత్యేక స్థానం. గాంధీ మహాత్ముడి పిలుపుతో దేశం మెుత్తం ఏకమైన నినాదం. ఎంతో మందిని కదిలించి.. స్వాతంత్య్ర కాంక్షను బలంగా మనసుల్లో నాటుకుపోయేలా చేసింది. 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారి నిష్క్రమణను వేగవంతం చేసింది. ఈ ఉద్యమం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బొంబాయి సెషన్‌లో ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే గాంధీజీ పిలుపుతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దేశం మెుత్తం ఏకమైంది. ఇప్పుడు ఆగస్టు క్రాంతి మైదాన్‌గా పిలిచే ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో గాంధీజీ ఆవేశ‌పూరితంగా ప్రసంగించారు. 'డూ ఆర్ డై' అంటూ పిలుపునిచ్చారు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా.. జాతిపిత కొన్ని రోజుల పాటు బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడీ వారసత్వ కట్టడం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సుందరంగా ముస్తాబు అయింది. బొల్లారం స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని పోలీసు సిబ్బంది సందర్శకులకు వారసత్వ కట్టడం వైభవాన్ని, ప్రాముఖ్యతను వివరిస్తూ వేడుకలను ప్రారంభించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది. నార్త్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ హెరిటేజ్ భవనాన్ని త్రివర్ణ పతాకాలు, బెలూన్లు, జెండాలు, జాతీయ జెండా ఫ్లడ్ లైట్లతో అలంకరించారు.

'ఈ పోలీస్ స్టేషన్ భవనానికి చరిత్ర ఉంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీ భారతదేశంలో పర్యటించారు. గాంధీజీ హైదరాబాద్‌లో పర్యటించి బొల్లారంలోని లక్ష్మీ రామలింగం ముదలియార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బ్రిటిష్ పోలీసులు గాంధీజీని అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌ తరలించారు.' అని ఇన్‌స్పెక్టర్‌ పి. శ్రీధర్‌ తెలిపారు.

బ్రిటీష్ పాలనలో బొల్లారం పోలీస్ స్టేషన్లో అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులను భవనం లోపల ఉంచారు. కొన్ని రోజుల తర్వాత మహాత్మా గాంధీ పోలీస్ స్టేషన్ నుండి విడుదలయ్యారు. గాంధీజీని ఉంచిన గదులను తరువాత పునరుద్ధరించారు. ప్రధాన భవనం ఇప్పటికీ బొల్లారం పోలీసు స్టేషన్‌గా పనిచేస్తోంది.

ఈ భవనం మరొక చారిత్రాత్మక ప్రాముఖ్యత ఏమిటంటే.. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడి నుంచే నిజాంపై పోలీసు చర్యను ప్లాన్ చేశారు. ఇలాంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ పోలీసు సిబ్బంది, అధికారులు ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను వారసత్వ కట్టడం చరిత్రను వివరించేందుకు ఈసారి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పోలీస్ స్టేషన్‌లోని అధికారులు ప్రతి రోజు రోల్ కాల్ సమయంలో ప్రతిజ్ఞ చేసి.. గౌరవ వందనం చేస్తారు.

సంబంధిత కథనం