Drone in Agriculture : క్రిషి 2.0 డ్రోన్ వచ్చేసింది... ఒక్క రోజులోనే 30 ఎకరాల్లో పిచికారీ-hyderabadbased drone company launches drones for agricultural use ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad-based Drone Company Launches Drones For Agricultural Use

Drone in Agriculture : క్రిషి 2.0 డ్రోన్ వచ్చేసింది... ఒక్క రోజులోనే 30 ఎకరాల్లో పిచికారీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 13, 2023 09:10 PM IST

Krishi 2.0 Drones in Telugu States: దేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవరహిత వైమానిక వాహనం (యుఏవి ) క్రిషి 2.0ను ఆవిష్కరించింది. ఇది వ్యవసాయ రంగంలో ఎంతో తోడ్పాటును అందించనుంది.

డ్రోగో డ్రోన్స్
డ్రోగో డ్రోన్స్

Drones in Agricultural Sector: కొంతకాలంగా వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. సంప్రాదాయ పద్ధతిలో కాకుండా... సాంకేతికతో కూడిన వ్యవసాయం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక సంస్థలు... రైతన్నలకు ఉపయోగపడే టెక్నాలజీని తీసుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన డ్రోగో డ్రోన్స్ అనే కంపెనీ.... వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు ఏడాదికి మూడు వేల డ్రోన్స్ ను ఉత్పత్తి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా... మానవరహిత వైమానిక వాహనం (యుఏవి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. వాటి వివరాలు చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

ఒక్క రోజులోనే 30 ఎకరాల్లో

భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్... మానవరహిత వైమానిక వాహనం (యు ఏ వి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్ 10 కిలోల పేలోడ్ సామర్థ్యంతో రూపొందించబడింది, ఈ డ్రోన్ రోజుకు 30 ఎకరాల్లో క్రిమిసంహారక, పురుగు మందులను పిచికారీ చేస్తుంది . నెలలో 750 నుండి 900 ఎకరాల్లో రైతులు తమ పంటలను కాపాడుకునేలా అవసరమైన మందులను పిచికారీ చేసే అవకాశం ఉంది. డ్రోగో డ్రోన్స్ సంస్థ ఇటీవల కాలంలో సర్వేయింగ్, మ్యాపింగ్ లలో అందిస్తున్న సేవలను రైతాంగానికి ఉపయోగపడే డ్రోన్ల తయారీవైపు మళ్లించింది. ఈ డ్రోన్ల తయారీకి అవసరమైన సర్టిఫికెట్ ను కేంద్రం తాజాగా డ్రోగో డ్రోన్స్ కు అందచేసింది. ఈ డ్రోన్లను హైదరాబాద్ తో పాటు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తయారు చేయనున్నారు. ఏడాదికి మూడువేల డ్రోన్లను తయారు చేయనుంది. డిమాండ్ ను బట్టి డ్రోన్ల తయారీని పెంచనుంది. డ్రోన్-ఆధారిత థర్మల్ ఇమేజింగ్, లిడార్ సేవలను డ్రోగో డ్రోన్స్ ఇప్పటి వరకు అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా డ్రోగో డ్రోన్స్ సంస్థ సి ఈ ఓ యశ్వంత్ బొంతు మాట్లాడుతూ “ఎంతో ఉత్సాహంతో, మేము క్రిషి 2.0ని ప్రపంచానికి అందిస్తున్నాము అని తెలిపారు. “అవిశ్రాంతంగా పరిశోధన, అభివృద్ధిలో భాగస్వామ్యమైన మా బృందం అంచనాలకు మించిన అద్భుతమైన డ్రోన్‌ను రూపొందించింది. క్రిషి 2.0 ఒక ఊహించని మార్పును వ్యవసాయ రంగంలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది, ఇది వ్యవసాయ రంగాన్ని శాశ్వతంగా మారుస్తుందని నమ్ముతున్నాము అని తెలిపారు . ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి క్రిషి 2.0 రూపొందించబడింది . దేశంలో తయారు చేసిన ఈ వ్యవసాయ డ్రోన్ పొలాల్లో ఎరువులు, పురుగుమందులను పిచికారీ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించామని ఆయన తెలిపారు . క్రిమిసంహారక మందులను పిచికారీ చేసే సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించటం తో పాటు రైతులకు ఖర్చు తగ్గిస్తుందని, సమయం ఆదా అవుతుందని” యశ్వంత్ తెలిపారు.

తాజా అంచనాల ప్రకారం... డ్రోన్ సేవల రంగం వార్షిక అమ్మకాల టర్నోవర్ వచ్చే మూడేళ్లలో రూ.30,000 కోట్లకు పైగా పెరగవచ్చు అని అన్నారు యశ్వంత్. పర్యవసానంగా, దేశంలో ఐదు లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. "దేశంలో డ్రోన్ మార్కెట్‌లో వ్యవసాయ రంగం కీలకమైనది. పంటల పరిరక్షణ, పర్యవేక్షణ, అధిక ఫలసాయానికి డ్రోన్‌ల వినియోగం పెరుగుతోంది. "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పంటల బీమా పథకం) వంటి కార్యక్రమాలు డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. డ్రోగో డ్రోన్స్ అత్యాధునిక తయారీ యూనిట్, అధునాతన సాంకేతికత, నైపుణ్యంతో నెలకొల్పారు నెలకు 200 డ్రోన్‌లను ఇది తయారు చేస్తుంది. డ్రోన్ పరిశ్రమలో అగ్రశ్రేణి డ్రోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి డ్రోగో సంస్థ సిద్ధంగా ఉంది. డ్రోగో సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 26 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది" అన్నారు.

WhatsApp channel