Hyderabad Student : పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి-hyderabad student drowns in canada lake during his birthday celebration ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Student : పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

Hyderabad Student : పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

Basani Shiva Kumar HT Telugu
Sep 16, 2024 06:27 PM IST

Hyderabad Student : పుట్టినరోజు అని స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి వెళ్లాడు. కానీ.. ఆ పుట్టినరోజే ఆఖరి రోజు అవుతుందని ఊహించలేదు. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి కెనడాలోని సరస్సులో మునిగి మృతిచెందాడు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కెనడాలో హైదరాబాద్ విద్యార్థి ప్రణీత్ మృతి
కెనడాలో హైదరాబాద్ విద్యార్థి ప్రణీత్ మృతి

హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కెనడా సరస్సులో మునిగిపోయాడు. కెనడాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న ప్రణీత్.. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో టొరంటోలోని సరస్సులో మునిగిపోయాడు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ప్రణీత్ కుటుంబంలో విషాదం నెలకొంది.

రంగారెడ్డి జిల్లా మీర్‌పేటకు చెందిన ప్రణీత్.. ఆదివారం స్నేహితులు, సోదరుడితో కలిసి కెనడాలోని క్లియర్ లేక్ సమీపంలోని కాటేజీకి వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. రెస్క్యూ బృందాలు సరస్సు వద్దకు చేరుకోవడానికి 10 గంటలకు సమయం పట్టింది. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ వార్త మృతుడి సోదరుడి స్నేహితుడి ద్వారా ప్రణీత్ కుటుంబానికి తెలిసింది.

దీంతో ప్రణీత్ కుటుంబ సభ్యులు కెనడాలోని ప్రణీత్ స్నేహితులను సంప్రదించారు. ప్రణీత్ మృతిచెందిన విషయాన్ని వారు ధ్రువీకరించారు. తన కుమారుడి జన్మదిన వేడుక విషాద దినంగా మారిందని ప్రణీత్ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. ప్రణీత్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహకరించాలని అతని తండ్రి ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రణీత్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 2022లో ప్రణీత్ అన్నయ్య కూడా కెనడా వెళ్లారు. ఆ తర్వాత చదువుల కోసం 2019లో ప్రణీత్ వెళ్లాడని అతని తండ్రి వివరించారు