Praneeth Hanumanthu: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Praneeth Hanumanthu Arrest: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అతడిని అదుపులోకి తీసుకోగా.. హైదరాబాద్‍కు తరలించనున్నారు.
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పోలీసులకు చిక్కాడు. బెంగళూరులో అతడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రీకూతుళ్లకు చెందిన ఓ వీడియో గురించి ప్రణీత్ హనుమంతు తన యూట్యూబ్ ఛానెల్‍లో అసభ్యమైన కామెంట్లు చేశాడు. ప్రణీత్ నిర్వహించిన ఆ ఆన్‍లైన్ చర్చలో పాల్గొన్న అతడి ఫ్రెండ్స్ కూడా కామెంట్లు చేశారు. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వెలుగులోకి తెచ్చారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. అతడి అచూకీ కోసం గాలించిన పోలీసులు నేడు (జూలై 10) చిక్కడంతో అరెస్ట్ చేశారు.

బెంగళూరులో అరెస్ట్
వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ టీమ్ బెంగళూరులో అరెస్ట్ చేసింది. అతడిని హైదరాబాద్‍కు తీసుకొస్తున్నారు పోలీసులు.
తండ్రీకూతుళ్లకు చెందిన ఓ వీడియోపై తన స్నేహితులతో కలిసి ప్రణీత్ హనుమంతు తన యూట్యూబ్ ఛానెల్ ఫనుమంతులో ఓ రియాక్షన్ వీడియో చేశాడు. దీంతో అతడితో పాటు మిగిలిన వారు కూడా బాలికపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
సాయిధరమ్ తేజ్ లేవనెత్తడంతో..
తండ్రీకూతుళ్లపై ప్రణీత్ హనుమంతు అసభ్య కామెంట్లు చేసిన విషయాన్ని యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ లేవనెత్తారు. ప్రణీత్‍పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍తో పాటు పోలీసు ఉన్నతాధికారులను సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై వారు స్పందించారు. కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బాలికపై అనుచిత ప్రణీత్ హనుమంతుపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ కేసుపై నేడు అతడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‍కు తీసుకొస్తున్నారు.
సర్వత్రా విమర్శలు
బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ హనుమంతుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నెటిజన్లతో పాటు చాలా మంది సినీ సెలెబ్రిటీలు కూడా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణీత్‍ను శిక్షించాల్సిందేనని కొందరు డిమాండ్ చేశారు. ప్రణీత్‍కు తన హరోం హర సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు అసహ్యంగా ఉందని హీరో సుధీర్ బాబు వెల్లడించారు. తనతో పాటు మూవీ టీమ్ తరఫున క్షమాణపలు చెప్పారు. అతడు అలాంటి వ్యక్తి అని తమకు తెలియదని చెప్పారు.
ప్రణీత్ హనుమంతుకు తాను ఇంటర్వ్యూ ఇచ్చి ఉండాల్సింది కాదని హీరో కార్తికేయ చెప్పారు. భజే వాయివేగం చిత్రం కోసం ఆయన ప్రణీత్ ఛానెల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, అప్పుడు వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు తాను షాకయ్యాయని, కానీ గొడవ వద్దనుకొని స్పోర్టివ్‍గా తీసుకున్నానని ఇటీవలే ట్వీట్ చేశారు. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు.. ప్రణీత్ చేసిన పనిని తీవ్రంగా ఖండించారు.
తాను చేసిన పనికి ప్రణీత్ హనుమంతు క్షమాపణలు చెప్పాడు. అయితే, తాము సరదా కోసమే ఇలా చేశామంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. కామెడీ తీరు మారుతోదంటూ చెప్పుకొచ్చాడు.