TS Group 4 Exam : గ్రూప్ 4 పరీక్ష రాస్తున్న అభ్యర్థి వద్ద సెల్ ఫోన్, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు
TS Group 4 Exam : తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష కొనసాగుతోంది. హైదరాబాద్ సరూర్ నగర్ లో ఓ అభ్యర్థి పరీక్ష రాస్తూ సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. సెల్ ఫోన్ సీజ్ చేసిన అధికారులు.. అతడిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు.
TS Group 4 Exam : పేపర్ల లీకేజీ వ్యవహారం అనంతరం టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తుంది. అయినా కొందరు అభ్యర్థులు అధికారుల కళ్లుగప్పి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష నిర్వహిస్తున్నారు. గ్రూప్-4 పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి సెల్ ఫోన్ పట్టుబడడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్ సరూర్ నగర్ లోని సక్సెస్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. పరీక్ష మొదలైన అరగంట తర్వాత అభ్యర్థి వద్ద ఫోన్ ను గుర్తించిన ఇన్విజిలేటర్...ఫోన్ తీసుకుని సీజ్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మినహా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
ప్రశాంతంగా కొనసాగుతోన్న పరీక్ష
తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష శనివారం ప్రారంభమైంది. ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో గ్రూప్-4 పరీక్ష కొనసాగుతోంది. మొత్తం 8,039 గ్రూప్-4 పోస్టులకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. శుక్రవారం రాత్రి వరకు 9,01,051 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం అభ్యర్థులు జనరల్ స్టడీస్ పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్ష కొనసాగుతోంది. కొన్ని చోట్ల అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో వారిని పరీక్ష రాసేందుకు నిర్వాహకులు అనుమతించలేదు.
95 శాతం మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్
టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో ఒకరోజు ముందు వరకు 95 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొన్నది గ్రూప్-4కు మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. గ్రూప్-4 పరీక్షపై 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పరీక్ష ఏర్పాట్లు, నిబంధనలు, పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులు ఇతర అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు. 2,878 లైజన్ ఆఫీసర్లతో కలెక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలని టీఎస్పీఎస్సీ సూచించింది. కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పరీక్ష కేంద్రాలకు వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశించింది.