Jani Master Arrest: జానీ మాస్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కాసేపట్లో హైదరాబాద్‌కు తరలింపు!
Jani Master Arrest: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా అయన్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు పెట్టారు.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జానీ మాస్టర్ ప్రస్తుతం సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులో ఉన్నారు. జానీ మాస్టర్‌ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పీఎస్‌లో ఓ యువతి కంప్లైంట్ ఇచ్చింది. తనపై అత్యాచారం చేశాడని, బెదిరించి గాయపరిచాడని ఆరోపించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు.
అవుట్ డోర్ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది. నార్సింగిలోనూ తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2017లో ఒక టీవీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేరానన్నారు. ఒక షో కోసం జానీకో కలిసి తాను ముంబయికి వెళ్లానని, అక్కడి హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.
జానీ మాస్టర్ ఇన్ని రోజులు పరారీలో ఉన్నారు. ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో పాటు ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదని పోలీసులు చెప్పారు. దీంతో జానీ మాస్టర్ కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. జానీ మాస్టర్ లద్దాక్ లో ఉన్నారన్న సమాచారంతో నాలుగు టీమ్ లు ఆయన కోసం బయలుదేరాయి. ముందు ఆయన నెల్లూరులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అక్కడ లేరని స్థానిక పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని నార్సింగి పోలీసులు తెలిపారు. తాజాగా బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.