Bhadraclam Priest: కోడలిపై భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు, ఏపీలో కేసు నమోదు, సస్పెన్షన్-bhadrachalam temple chief priest sexually assaults daughter in law case registered in ap ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadraclam Priest: కోడలిపై భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు, ఏపీలో కేసు నమోదు, సస్పెన్షన్

Bhadraclam Priest: కోడలిపై భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు, ఏపీలో కేసు నమోదు, సస్పెన్షన్

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 19, 2024 06:31 AM IST

Bhadraclam Priest: కోడలిని వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఏపీలోని పశ్చిమగోదావరిలో ఆలయ ప్రధానార్చకుడిపై పోలీస్‌ కేసు నమోదు కావడంతో తెలంగాణ దేవాదాయశాఖ చర్చలకు ఉపక్రమించింది. ఆలయ ప్రధానార్చకుడిపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి.

కోడలితో అనుచిత ప్రవర్తన, వేధింపులు, భద్రాచలం ప్రధానార్చకుడి సస్పెన్షన్
కోడలితో అనుచిత ప్రవర్తన, వేధింపులు, భద్రాచలం ప్రధానార్చకుడి సస్పెన్షన్

Bhadraclam Priest: కోడలికి వరకట్న వేధింపులతో లైంగికంగా వేధించారనే అభియోగాలతో పోలీస్ కేసు నమోదు కావడంతో భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిని సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసు నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ప్రధానార్చకుడితో పాటు ఆయన దత్తపుత్రుడిపై చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన పోలికలతో వారసుడిని ఇవ్వాలంటూ కోడలిని వేధింపులకు గురి చేశాడని బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. 

భద్రాచలం ఆలయంలో ప్రధానార్చకుడిగా విధులు నిర్వర్తిస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఆయన దత్తపుత్రుడు, ఆలయ అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి తిరుమల వెంకట సీతారాంలను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆలయ ఈవో రమాదేవి బుధవారం సాయంత్రం వెల్లడించారు. ఫిర్యాదు తీవ్రత దృష్ట్యా విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. 

భద్రాచలం రాముల వారి ఆలయంలో ప్రధానార్చకుడు సీతారామాను జాచార్యులిపై ఆయన కోడలు, వెంకట సీతారాం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై వరకట్నం, లైంగిక వేధింపుల అభియోగాలపై ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణను అక్కడి పోలీసులు చేపట్టారు. కేసు నమోదైన విషయం తెలిసినా ఆ వివరాలను అర్చకులిద్దరూ అధికారులకు తెలియకుండా దాచి పెట్టడంతో బాధితులు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

తాడేపల్లి గూడెం పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీతారామానుజాచార్యులుకు కుమార్తెలు ఉన్నా కుమారులు లేకపోవడంతో తనకు తెలిసిన కుటుంబానికి చెందిన సీతారాంను కొన్నేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. సీతారాంకు తాడేపల్లి గూడెం పట్టణానికి చెందిన యువతితో 2019లో వివాహం జరిపించారు.

పెళ్లైన కొద్ది నెలలకే సీతారాం భార్యకు వేధింపులు మొదలయ్యాయి. అత్త, ఆడ పడుచులు, ఇతర కుటుంబ సభ్యులు రూ.10 లక్షల వరకట్నం తీసుకురావాలని బాధితురాలిని వేధించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో మామ సీతారామానుజా చార్యులు బాధితురాలిపై లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు.

మామ ప్రవర్తనపై బాధితురాలు తన భర్తకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత కూడా తండ్రికే అనుకూలంగా మాట్లాడి... భార్యతోనే తండ్రికి క్షమాపణ చెప్పించాడు. ఆ తర్వాత నుంచి సీతారామానుజాచార్యులు మరింత రెచ్చిపోయాడు.

తనకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయని.. తన పోలికలతో వారసుడు కావాలని ఆమెను ఒత్తిడికి గురి చేశాడు. వేధింపులు తాళలేక బాధితురాలు గత ఆగస్టులో తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 14న పలు సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ విషయాన్ని నిందితులు దాచిపెట్టారు. దీనిపై దేవాదాయశాఖకు ఫిర్యాదు అందడంతో ఇద్దరిని అధికారులు సస్పెండ్‌ చేశారు.

Whats_app_banner