Rajendranagar News : దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా రాజేంద్రనగర్, అమిత్ షా చేతుల మీదుగా అవార్డు
Rajendranagar News : దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ లలో హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పీఎస్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీద రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ట్రోఫీని అందుకున్నారు.
Rajendranagar News : దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ లలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పీఎస్ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్రనగర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జైపూర్ లో జరిగిన డీజీపీల సదస్సులో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు ట్రోఫీని అందుకున్నారు. తెలంగాణ డీజీపీ రవి గుప్త ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
2023లో దేశంలో ఉన్న దాదాపు 17 వేల పోలీస్ స్టేషన్ ల పని తీరు ఆధారంగా వివిధ అంశాలను పరిశీలించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ బహుమతులను ప్రకటించింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ రకాల కేసుల దర్యాప్తు జరిగిన తీరు, పోలీస్ స్టేషన్ నిర్వహణ తీరు తదితర అంశాల ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. మహిళలపై కేసుల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ సేఫ్టీ వంటి అంశాలను కేంద్ర హోంశాఖ పరిగణనలోకి తీసుకుంది.
సీసీటీఎన్ఎస్ ద్వారా రెండో దశలో 75 పోలీస్ స్టేషన్ ల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి చివరకు దేశంలోనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ను అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా ప్రకటించింది. ఈ జాబితాలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలవగా.....తరువాతి స్థానాల్లో కాశ్మీర్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీస్ స్టేషన్ లు రెండు మరియు మూడు స్థానాల్లో ఉన్నాయి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా