Eggs Price : హైదరాబాద్ లో కొండెక్కిన కోడి గుడ్డు ధర, ఒక్క గుడ్డు 7 రూపాయలు-hyderabad news in telugu egg price hike demand in peak ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Eggs Price : హైదరాబాద్ లో కొండెక్కిన కోడి గుడ్డు ధర, ఒక్క గుడ్డు 7 రూపాయలు

Eggs Price : హైదరాబాద్ లో కొండెక్కిన కోడి గుడ్డు ధర, ఒక్క గుడ్డు 7 రూపాయలు

HT Telugu Desk HT Telugu
Dec 23, 2023 07:33 PM IST

Eggs Price : హైదరాబాద్ లో కోడిగుడ్డు ధర కొండెక్కింది. గత 15 రోజుల్లో కోడి గుడ్డు ధర రూ.7 చేరింది. వాతావరణ మార్పులు, కూరగాయల ధరలు పెరగడంతో కోడిగుడ్డు ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

కోడిగుడ్లు
కోడిగుడ్లు (Unsplash)

Eggs Price : కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది.15 రోజుల క్రితం ఒక్క కోడిగుడ్డు ధర రూ.6 ఉండగా ప్రస్తుతం రూ.7 పలుకుతుంది. హోల్ సేల్ లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.80 లకు చేరింది. డిమాండ్ భారీగా పెరగడంతో కోడిగుడ్డు ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. చలికాలం కావడం, ఇటు కూరగాయల ధరలు పెరగడంతో హైదరాబాద్ లో కోడిగుడ్డుకు భారీగా డిమాండ్ పెరిగింది.

హైదరాబాద్ లో కోడిగుడ్లకు భారీ డిమాండ్

హైదరాబాద్ లో సాధారణంగా రోజుకు 80 లక్షల కోడిగుడ్లు వాడకం ఉంటుందని, ప్రస్తుతం ఈ డిమాండ్ కోటికి పైగా చేరిందని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ పేర్కొంది. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో రోజుకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు కోడిగుడ్ల వినియోగం ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కార్తీక మాసంలో కాస్త తక్కువగా ఉన్న కోడిగుడ్ల ధరలు, కార్తీక మాసం ముగియడంతో పెరిగాయి. వీటితో పాటు కోళ్ల దాణా ధరలు రెట్టింపు అవ్వడం కూడా గుడ్ల ధరలు పెరగడానికి కారణం అని వ్యాపారులు చెబుతున్నారు.

గతంలో కరోనా టైమ్ లో కోడిగుడ్ల వినియోగం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని చాలా మంది కోడిగుడ్లను తింటున్నారని కొందరు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న గుడ్లలో 50 శాతం దిల్లీ, ముంబయి నగరాలతో పాటు ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు.

చికెన్ కూడా

ఇటు చికెన్ ధర కూడా పెరిగింది. కార్తీక మాసం సమయంలో కేజీ చికెన్ ధర రూ.170 నుంచి రూ.190 పలికితే ఇప్పుడు రూ.250కి చేరింది. అటు అల్లం, వెల్లుల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక ఉల్లి ధరల విషయానికి వస్తే అవి కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు ఇలా పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయడుతున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్,హైదరాబాద్ జిల్లా

Whats_app_banner