KTR : జనవరి కరెంట్ బిల్లులు ఎవరూ కట్టకండి, బిల్లు అడిగితే సీఎం మాటలు చూపించండి- కేటీఆర్
KTR : జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దని కేటీఆర్ ప్రజలను కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
KTR : పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ,కాంగ్రెస్ కలిసిపోతాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే అవుతారని విమర్శించారు. బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడ్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. 100 రోజుల్లో నెరవేస్తామన్న హామీల సంగతేంటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దొంగ హామీలను ప్రశ్నిస్తున్నందకా మమ్మల్ని బొందపెడ్తారు అని నిలదీశారు. శనివారం తెలంగాణ భవన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ...సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. రేవంత్ లాంటి అహంకార నాయకులను బీఆర్ఎస్ చాలామందిని చూసిందన్నారు.
కరెంటు బిల్లులు కట్టకండి
రేవంత్ రక్తం అంత మొత్తం బీజేపీదే అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ చోటా మోదీగా మారిండన్నారు. రాహుల్ గాంధీ అదానీపై విమర్శలు చేస్తుంటే...రేవంత్ రెడ్డి అదానీతో అలైబలై చేసుకుంటున్నారన్నారు. దావోస్ లో రేవంత్ రెడ్డి అదానీ ఒప్పందాల అసలు గుట్టు బయటపెట్టాలన్నారు. జనవరి నెల కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దని ప్రజలను కోరారు కేటీఆర్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత కరెంట్ హామీని నెరవేర్చే వరకు బిల్లులు కట్టొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయాలన్నారు. కరెంటు బిల్లులు కట్టమంటే సీఎం మాటలను చూపించాలన్నారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపించాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి మీటర్‌కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కిరాయి ఇండ్లలో ఉండే వాళ్లకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. దీంతో పాటు మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకోవడానికి చూస్తే వదిలిపెట్టమన్నారు. 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
420 హామీలు
బీజేపీతో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో పొత్తుపెట్టుకోదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకుంది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రజల పక్షమే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుబంధు నిలిచిపోవడం, మహిళలకు రూ.2500 రావడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలని ప్రజలు గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా బీఆర్ఎస్ వెంటాడుతుందని కేటీఆర్ అన్నారు.
"100 మీటర్ల లోపల బీఆర్ఎస్ ను బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్... తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా."-కేటీఆర్