Abhishek Agarwal : టైగర్ నాగేశ్వరరావు నిర్మాత ఆఫీసుపై ఐటీ దాడులు, లావాదేవీలపై ఆరా?
Abhishek Agarwal : టైగర్ నాగేశ్వరరావు, కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు చేశారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రం నిర్మాణానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడంతో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
Abhishek Agarwal : హీరో రవితేజ తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాను అభిషేక్ అగర్వాల్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని తెలుస్తోంది. సినిమా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అభిషేక్ అగర్వాల్ కు ఎక్కడ నుంచి వచ్చిందన్న కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ లావాదేవీలు సరిగా ఉన్నాయా, పన్ను ఎగవేతలకు పాల్పడ్డారా? అనే నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అభిషేక్ అగర్వాల్ బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆయన నిర్మించిన ది కశ్మీర్ ఫైల్ సినిమాకు బీజేపీ వర్గాలు నిలిచాయి. మొదట్లో చిన్న సినిమాలు తీసిన అభిషేక్ అగర్వాల్… ఇటీవల పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. దీంతో ఐటీ అధికారులు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
దసరాకు టైగర్ నాగేశ్వరరావు విడుదల
టైగర్ నాగేశ్వరరావు సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ నిర్మిస్తుంది. గతంలో ఈ బేనర్ లో కశ్మీర్ ఫైల్స్, ధమాకా, గూడచారి2 లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించారు. స్టూవర్టుపురం గజదొంగ జీవిత కథ ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నురూప్ సనన్ హీరోయిన్ గా నటించారు. రేణు దేశాయ్, నాజర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు
ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. హైదరాబాద్ శివార్లలోని చిట్‌ఫండ్ కంపెనీల లక్ష్యంగా 100 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు మొత్తం 14 చోట్ల తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్‌బీ కాలనీ, శంషాబాద్ తదితర చోట్ల చిట్‌ఫండ్ కంపెనీల వ్యాపారులు, కాంట్రాక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో పాటు ఎల్లారెడ్డిగూడలో ఉండే ఆయన సోదరుడు వజ్రనాథ్, వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు ఇళ్లు, కంపెనీ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. కూకట్‌పల్లిలోని ఇందూ ఫార్చూన్ ఫీల్డ్స్, యూసుఫ్ గూడలోని పూజాకృష్ణ చిట్‌ఫండ్స్, శంషాబాద్‌లోని ఈకాం కంపెనీ మేనేజర్ రఘువీర్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.