Hyderabad Tank Bund : జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం, ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ నిషేధం
Hyderabad Tank Bund : జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Hyderabad Tank Bund : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ ను నిషేధిస్తునట్లు ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో పర్యాటక ప్రదేశాల్లో ట్యాంక్ బండ్ ఒకటి. ట్యాంక్ బండ్ చుట్టూ పార్కులు, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం వంటివి ఉంటడంతో ఎక్కువ మంది సందర్శకులు ట్యాంక్ బండ్ కు వస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు అయితే సాయంత్రం వేళలో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి సేదతీరుతూ ఉంటారు.
ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్ నిషేధం
నగర నడిబొడ్డున ఉన్న ఈ ట్యాంక్ బండ్ పై అర్ధరాత్రి వరకు రద్దీ ఉంటూనే ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి తమ కుటుంబ సభ్యులు,స్నేహితులు, ప్రియమైన వారి జన్మదిన వేడుకలను అక్కడ జరుపుతూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో కేక్ కట్ చేసి అనంతరం కేక్ కవర్, స్ప్రే బాటిల్స్, సహా ఇతర వస్తువులను అక్కడే చిందరవందరగా పడేస్తూ ఉంటారు. దీంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్ బండ్ వద్ద కొంత మేర మాత్రమే చెత్త ఉంటే అర్ధరాత్రి 11 గంటల నుంచి 12:30 గంటల వరకు అధిక మొత్తంలో చెత్త ఉంటుందని GHMC వర్కర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అంతే కాకుండా కేక్ ను రోడ్లపై వెదజల్లుతూ రోడ్లపైకి వస్తూ కొన్ని సార్లు వాహనదారులకు కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు.
నిబంధనలు అతక్రమిస్తే జరిమానా
ఇలాంటి ఘటనలపై ప్రజలు పలు సందర్భాల్లో జీహెచ్ఎంసీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అధిక మొత్తంలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో జీహెచ్ఎంసీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్స్, ఇతర వేడుకలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఎవరైనా నిబంధలను అతిక్రమించి కేక్ కటింగ్స్, ఇతర వేడుకలు జరిపితే జరిమానా విధిస్తామని ప్రకటించింది. ట్యాంక్ బండ్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని ప్రజలు తమకు సహకరించాలని నోటీస్ బోర్డును ఏర్పాటు చేశారు అధికారులు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్