CM KCR : ప్రజాగాయకుడు గద్దర్ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు
CM KCR : ప్రజాగాయకుడు గద్దర్ భౌతిక కాయానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అల్వాల్ లోని ఆయన నివాసంలో గద్దర్ పార్థివ దేహానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
CM KCR : ప్రజా యుద్ధనౌక గద్దర్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి సోమవారం సాయంత్రం సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం గద్దర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయి బాలకిషన్, చంటి క్రాంతి కిరణ్, మైనంపల్లి హన్మంత్ రావు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న నివాళులు అర్పించారు.
గద్దర్ మృతిపై మావోయిస్టుల సంతాపం
ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గద్దర్ మరణం తెలంగాణ ప్రజలందరికీ ఆవేదన కల్గించిందని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ లేఖలో వివరించింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు లేరన్నారు. గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధకు గురిచేసిందన్నారు. గద్దర్ కుటుంబానికి తమ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. నగ్జల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని లేఖలో పేర్కొన్నారు. బుర్ర కథలు, పాటలు, నాటికలు, ఒగ్గు కథలతో పీడిత ప్రజలను చైతన్యపరిచారని తెలియజేశారు. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉందన్నారు.
విప్లవ ప్రస్థానం
1972 నుంచి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగిందని మావోయిస్టులు లేఖలో తెలిపారు. నాలుగు దశాబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డారని పేర్కొన్నారు. 1972 నుంచి 2012 వరకు గద్దర్ మావోయిస్టు సభ్యుడిగా కొనసాగారని తెలిపారు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవకారుల మృతదేహాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో బాధితులకు వారి మృతదేహాలను అందేలా ఉద్యమానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. సాంస్కృతి రంగం అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసిందన్నారు. 1997లో గద్దర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కాల్పులు చేశారని, ఐదు తూటాలు శారీరంలో దూసుకెళ్లి ప్రాణ ప్రాయస్థితి నుంచి బయటపడ్డారన్నారు. గద్దర్ చివరి కాలంలో పార్టీ నింబంధనావళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో మావోయిస్టు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. దీంతో 2012లో పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారన్నారు.