Dasoju Sravan : విద్యార్థులకు కమ్మని బ్రేక్ ఫాస్ట్ పెడుతుంటే కాంగ్రెస్ నేతలకెందుకు కడుపుమంట - దాసోజ్ శ్రవణ్
Dasoju Sravan On Revanth Reddy : ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలి కారణంగా చదువుకు దూరం కాకూడదనే సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టారని దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి రాజకీయం చేయడం ఏంటని మండిపడ్డారు.
Dasoju Sravan On Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్ పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయని ప్రశ్నించారు. అడ్డగోలు సంపాదనకు, దోపిడీకి అలవాటు పడి కోట్లకు పడగలెత్తిన రేవంత్ రెడ్డికి, పేదింటి పిల్లల ఆకలి బాధ తెలియదన్నారు. పొద్దున్నే స్కూల్ లో పసిపిల్లల కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతుంటే మీ కళ్లలో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పిల్లల తల్లిదండ్రులకు ఇబ్బందులు కాకుండా పొద్దున్నే పిల్లలకు పౌష్టికాహారం తినిపించాలన్న సోయిలేని మీరు.. ఇవాళ ఇవన్నీ అమలు చేస్తున్న కేసీఆర్ పై విమర్శలు మీ మానసిక పరిస్థితికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 23 లక్షల మంది విద్యార్థులకు కేసీఆర్ కడుపునిండా కమ్మని అల్పాహారం పెట్టి కన్న తండ్రిలాగా ఆ పిల్లలకు అండగా ఉంటుంటే కాంగ్రెస్ నేతల కడుపులు ఎందుకు మలమల కాలుతున్నాయన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే పనికిరాని బడి అన్నట్టు అభిప్రాయం ఉండేదని, కానీ నేడు అద్భుతమైన సౌకర్యాలతో ప్రభుత్వ స్కూల్ లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
ఆకలి కారణంగా చదువు దూరం కాకూడదనే
"అద్భుతమైన భవనాలు, కమ్మటి అల్పాహారం.. మంచి మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఉచితంగా నాణ్యమైన యూనిఫామ్ బట్టలు .. ఒక చక్కటి వాతావరణంలో విద్యానందిస్తున్న విద్యాదాత కేసీఆర్. రేవంత్ రెడ్డి మాటలు బడుగు, బలహీన, దళిత, గిరిజన, పేద వర్గాల జనం నమ్మరు. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లల ఆకలి తీరుస్తూ వారు బాగా చదువుకోవాలని సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకం తెస్తే దానిపై రేవంత్ రాజకీయం చేయడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం పేద పిల్లలకు వరం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలి కారణంగా చదువుకు దూరం కాకూడదనే సూత్రాన్ని నమ్మిన సీఎం కేసీఆర్ ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తుంటారు. డ్యూటీలకు వెళ్తుంటారు. ఆయా కుటుంబాలకు చెందిన పిల్లలు తినకుండా స్కూళ్లకు వస్తున్నారు. ఆకలైతే చదువు బుర్రకెక్కే అవకాశముండదు. ముందు కడుపునిండితేనే చదువు బుర్రకెక్కుతుంది. అందుకు విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం"- దాసోజు శ్రవణ్
23 లక్షల విద్యార్థులకు ప్రయోజనం
సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన వెనక మానవీయ కోణం ఉంటుందని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రతి పథకం అమలుకు కేసీఆర్ సామాజిక కోణంతో ఆలోచిస్తారన్నారు. అల్పాహార పథకం కూడా కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదని, పాఠశాలల్లో డ్రాపవుట్స్ తగ్గించి, బడి ఈడు పిల్లలందరినీ బడిబాట పట్టించి, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకం అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 1వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది కానుందన్నారు. ఈ పథకాన్ని రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈ తరహా హై స్కూల్ విద్యార్థులకు ఎన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క కాంగ్రెస్ లేదా బీజేపీ పాలిట రాష్ట్రంలో కూడా ఈ తరహా పథకం అమలు కావడం లేదన్నారు. కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క చోట కూడా ఇలాంటి పథకం లేదన్నారు. బ్రేక్ ఫాస్ట్ కు బ్రేకులు వేద్దామనుకుంటున్న రాజకీయ కుటిల ఆలోచనకు ప్రజలే బుద్ది చెబుతున్నారన్నారు.