MP Raghunandan Rao : రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధమేంటో- ఎంపీ రఘునందన్ రావు పాత వీడియో వైరల్
MP Raghunandan Rao : నాగార్జున, సమంత, బీఆర్ఎస్ గురించి గతంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో తాజాగా వైరల్ అవుతుంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా...బీఆర్ఎస్ హయాంలో ఎందుకు కూల్చలేదని, సమంతను చేనేత అంబాసిడర్ గా ఎందుకు చేశారని రఘునందర్ రావు ప్రశ్నించారు.
హీరో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గతంలో చేసిన వ్యాఖ్యలు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నెల క్రితం ఐడ్రీమ్ మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత, నటి సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ కావడం వంటి విషయాలపై మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
హీరో నాగార్జున భాగస్వామిగా ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఇటీవల హైడ్రా కూల్చివేసింది. ఈ సమయంలో హీరో నాగార్జున కోర్టుకు వెళ్లినా అప్పటికే హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. ఈ విషయంపై ఐడ్రీమ్ మీడియా ఇంటర్వ్యూలో ఎంపీ రఘునందర్ రావు స్పందించారు. తుమ్మిడి చెరువులోని మూడు ఎకరాల 30 కుంటలను ఆక్రమంచి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రా కూల్చివేసిందన్నారు.
2014లోనే హైకోర్టు ఆదేశాలు
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంపీ రఘునందర్ రావు ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ ఉన్న ప్రాంతాన్ని సర్వే చేయాలని 2014లో అప్పటి ఉమ్మడి హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. కోర్టు ఆదేశాలతో హెచ్ఎండీఏ 2016లో రిపోర్టు సమర్పించిందని గుర్తుచేశారు. ఈ నివేదిక ప్రకారం మూడున్నర ఎకరాల ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌ను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హెచ్ఎండీఏ కోర్టుకు తెలిపిందన్నారు.
2024 వరకు ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదు?
అయితే 2016 నుంచి 2024 వరకు ఎన్ కన్వెన్షన్‌ను ఎందుకు కూల్చలేదని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో హీరో నాగార్జున మాజీ కోడలు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారన్నారు. ఆమెకు చేనేత, చీర గురించి తెలియదని రఘునందన్ రావు అన్నారు. ఆ సంబంధాలేంటో వాళ్లే చెప్పాలని, వాళ్లకు రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్లు చెబితేనే బాగుంటుందని బీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నెల క్రితం ఈ వీడియోను ఐడ్రీమ్ మీడియా యూట్యూబ్ లో పోస్టు చేసింది. మంత్రి కొండా సురేఖ వివాదంతో తాజాగా ఎంపీ రఘునందన్ రావు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరో నాగార్జున పరువు నష్టం దావా
మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరువు నష్టం దావాపై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం హీరో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసులో తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. తన వాంగ్మూలం ఇచ్చేందుకు నాగార్జున రేపు కోర్టుకు హాజరు కానున్నారు.
సంబంధిత కథనం