Nagarjuna : ఎన్ కన్వెన్షన్ పై పుకార్లు నమ్మొద్దు, ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదు- హీరో నాగార్జున-hero nagarjuna tweet on n covention building demolition request donot believe rumors ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagarjuna : ఎన్ కన్వెన్షన్ పై పుకార్లు నమ్మొద్దు, ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదు- హీరో నాగార్జున

Nagarjuna : ఎన్ కన్వెన్షన్ పై పుకార్లు నమ్మొద్దు, ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదు- హీరో నాగార్జున

Bandaru Satyaprasad HT Telugu
Aug 25, 2024 09:51 PM IST

Nagarjuna On N Convention : మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హీరో నాగార్జున మరోసారి స్పందించారు. ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిలో నిర్మించామని, ఒక సెంటు భూమి కూడా ఆక్రమించలేదన్నారు. ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని అభిమానులను కోరారు.

ఎన్ కన్వెన్షన్ పై పుకార్లు నమ్మొద్దు, సెంటు భూమి కూడా ఆక్రమించలేదు-నాగార్జున
ఎన్ కన్వెన్షన్ పై పుకార్లు నమ్మొద్దు, సెంటు భూమి కూడా ఆక్రమించలేదు-నాగార్జున

Nagarjuna On N Convention : హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని తుమ్మడికుంట చెరువు ఆక్రమణల తొలగింపులో భాగంగా హైడ్రా.. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను శనివారం ఉదయం కూల్చివేసింది. కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఘటనపై తాజాగా మరోసారి స్పందించిన హీరో నాగార్జున తన అభిమానులు, శ్రేయోభిలాషులకు ఉద్దేశించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

"ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంటెడ్. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం తీర్పునకు నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను" - అక్కినేని నాగార్జున

హైకోర్టు స్టే

హైదరాబాద్ మాదాపూర్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసింది. ఈ కూల్చివేతలను ఆపాలని నాగార్జున శనివారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని స్టే విధించింది. గండిపేట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా శనివారం కూల్చివేస్తుంది. ఈ నిర్మాణాలు రాజకీయ నాయకులు, ప్రముఖుల కావడంతో కూల్చివేతలు సంచలనంగా మారుతున్నాయి. తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా...శనివారం ఉదయం యాక్షన్ లోకి దిగింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఉన్న ఎన్ కన్వెన్షన్ భాగాన్ని కూల్చివేసింది.

హైడ్రా కమిషన్ వివరణ

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తుమ్మడికుంట ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ లోని అక్రమ కట్టడాలను హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది కూల్చివేసినట్లు తెలిపారు. తుమ్మడికుంటలోని అక్రమ నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ ఒకటన్నారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 కుంటలు, బఫర్‌ జోన్‌ లో 2 ఎకరాల 18 కుంటల్లో ఎన్‌ కన్వెన్షన్‌ ను అక్రమంగా నిర్మించారన్నారు. గతంలో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ప్రయత్నించిందన్నారు. అయితే బీఆర్ఎస్ అనుమతి ఇవ్వలేదన్నారు.

2014లో తుమ్మడికుంటపై హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ హైకోర్టుకు వెళ్లిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయితే చట్టబద్ధంగా ఉండాలని కోర్టు తెలిపిందన్నారు. 2017లో ఎఫ్టీఎల్ సర్వేపై కేసు పెండింగ్ లో ఉందన్నారు. అంతేగానీ ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఏ కోర్టు స్టే ఇవ్వలేదన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పై ఎన్ కన్వెన్షన్ హైకోర్టును తప్పుదోవ పట్టిందని రంగనాథ్ తెలిపారు.

సంబంధిత కథనం