HMWSSB OTS Scheme : హైదరాబాద్ వాసులకు మరో ఛాన్స్ - పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, గడువు పొడిగింపు-hmwssb one time settlement scheme deadline extended till 30th november ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hmwssb Ots Scheme : హైదరాబాద్ వాసులకు మరో ఛాన్స్ - పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, గడువు పొడిగింపు

HMWSSB OTS Scheme : హైదరాబాద్ వాసులకు మరో ఛాన్స్ - పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 03, 2024 05:27 AM IST

HMWSSB One Time Settlement Scheme 2024: హైదరాబాద్ వాసులకు జలమండలి మరో అలర్ట్ ఇచ్చింది. OTS స్కీమ్ గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.ఈ స్కీమ్ లో భాగంగా పెండింగ్ బిల్లుల విషయంలో ఆలస్య రుసుముతో పాటు వడ్డీమాఫీ కానుంది. నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, గడువు పొడిగింపు
పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, గడువు పొడిగింపు

వాటర్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకునేందుకు హైదరాబాద్ జలమండలి వన్ టైం సెటిల్ మెంట్ స్కీమ్(OTS) ను మళ్లీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించేందుకు వియోగదారులకు చక్కటి అవకాశం కల్పించింది. ఇందుకోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్-2024) పథకాన్ని మళ్లీ తీసుకొచ్చింది. ఈ గడువు అక్టోబర్ 31 తేదీతో పూర్తి అయింది. అయితే చాలా మంది వినియోగదారుల నుంచి విజ్ఞప్తులు రావటంతో... ఈ గడువును పొడిగించింది.

నవంబర్ 30 వరకు గడువు..!

ఈ స్కీమ్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. పెండింగ్ బిల్లుల విషయంలో ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా బకాయిలు చెల్లించే సువర్ణ అవకాశాన్ని జలమండలి కల్పించింది. ఈ అవకాశాన్ని పలువురు వినియోగదారులు వినియోగించుకున్నప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదు. ఇందుకు ప్రధాన కారణం అక్టోబర్ మాసంలో సెలవులు దినాలు అధికంగా వచ్చాయి.

దసరా, బతుకమ్మ సెలవులు రావటంతో ఈ అవకాశాన్ని చాలా మంది వినియోగదారులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే... గడువును పెంచే అంశంపై జల మండలి ప్రతిపాదనలు చేసింది. ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో... ఈ నెలాఖారు వరకు చెల్లింపులు చేసే అవకాశం ఉంది.

వాటర్ పెండింగ్ ఇప్పటివరకు చెల్లించనివారు.. ఈ స్కీమ్ ద్వారా క్లియర్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పేన్ ఫే, గూగుల్ పే, ఆన్ లైన్ మెంట్ పేమెంట్ మాత్రమే కాకుండా క్యూఆర్ కోడ్ ఉపయోగించి కూడా క్లియర్ చేసుకోవచ్చని అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.

జలమండలిలో నీటి బకాయిలు పెరిగిపోతుండటంతో.. అధికారులు ఈ స్కీమ్ తీసుకువచ్చారు. ఈ ఓటీఎస్ కింద.. వినియోగదారులు తమ బకాయిలను ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. జలమండలిలో గతంలో రెండు సార్లు ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ను 2016, 2020లో లో అమలు చేశారు.

నిబంధనలు ఏంటంటే :

  • నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • ఓటీఎస్ స్కీమ్ నవంబర్ 30, 2024 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
  • గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి.
  • గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది.
  • ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలి. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు.
  • తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్ లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
  • నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీమాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు.
  • దీని ప్రకారం.. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది.

Whats_app_banner