Hyderabad Rains : హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..! ఉరుములతో కూడిన జల్లుల పడే ఛాన్స్!
హైదరాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద పారింది. ఇవాళ రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతోంది. గత మూడు నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇావాళ మధ్యాహ్నం తర్వాత కూడా నగరంలోని చాలా చోట్ల వాన పడింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం….నగరంలో మోస్తారు వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయని పేర్కొంది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
ఇక తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్(X ఖాతా) ప్రకారం… మరో రెండు మూడు గంటల్లో నగర శివారు ప్రాంతలైన శంషాబాద్, ఇబ్రహీంపట్నంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
మరోవైపు హైదరాబాద్ నగరంలో భారీవర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు జరుపుతున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు ఉంటాయని అంచనా ఉందని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే 1912 కాంటాక్ట్ చేయాలని ఓ ప్రకటనలో వివరించారు.
ఇక ఇవాళ తెలంగాణలో చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు (సెప్టెంబర్ 26) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
సెప్టెంబర్ 27వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి,ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28వ తేదీ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఏపీలో తేలికపాటి వర్షాలు:
ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రేపు శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి,మన్యం, అల్లూరి,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.