TS Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి, హెచ్చరికలు జారీ
Weather Updates Telugu States: హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వాన నగరవాసుల్ని పలకరించింది. మరోవైపు కళాసిగూడలోని మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి మృతి చెందింది.
Rains in Telangana: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ స్థాయిలో పంట నష్టం వాటిల్లింది. ఓవైపు తెలంగాణకు మరో 4 రోజులు వర్ష సూచన ఇవ్వగా... శనివారం ఉదయమే హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఫలితంగా పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి.
కాప్రా, చర్లపల్లి, ఈసీఐఎల్, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టలో వర్షం పడింది. సూరారం, అమీన్‌పూర్, సుచిత్ర, బాలానగర్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, కేపీహెచ్‌బీ కాలనీ, సైదాబాద్, మలక్‌పేట, కార్వాన్, షేక్‌పేట, రాయదుర్గం, మారేడుపల్లి, నాచారం, మల్లాపూర్, మల్కాజిగిరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుసింది. సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేటలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బేగంపేట్, వారసిగూడ ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరో 4 రోజులు వర్షాలు…
TS Weather Updates: రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో దిగువ స్థాయిలో గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో చాలాచోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శనివారం సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన(40-50 కి.మీ) వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతాయని తెలిపింది.
ప్రాణం బలి…
వర్షాల దాటికి ఓ చిన్నారి ప్రాణం బలైపోయింది. మ్యాన్‌హోల్‌లో చిన్నారి మృతి చెందింది. కళాసిగూడలో శనివారం ఉదయం.. పాలప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. పాప కోసం వెతుకుతుండగానే... పార్క్ లైన్ దగ్గర పాప మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది కనిపెట్టారు. మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయిందని తెలిసింది. కుటుంబం సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Rain Alert to Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఐఎండీ అంచనాల ప్రకారం ఏపీ విపత్తుల శాఖ వివరాలను ప్రకటించింది.శనివారం రోజు ఉత్తరాంధ్ర,గుంటూరు, పల్నాడు,బాపట్ల, ప్రకాశం,అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం,సోమవారం రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మంగళవారం రోజు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో కూడి"పిడుగులు"పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదు. రైతులు,కూలీలు,గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
సంబంధిత కథనం