BRS Harish Rao : రుణమాఫీ అమలు కోసం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం - హరీశ్ రావ్-harish rao announcement that we will hold a dharna in front of rahul gandhi house for the implementation of loan waiver ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Harish Rao : రుణమాఫీ అమలు కోసం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం - హరీశ్ రావ్

BRS Harish Rao : రుణమాఫీ అమలు కోసం రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం - హరీశ్ రావ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 04, 2024 04:11 PM IST

రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీ అమలు కోసం దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు.

తొర్రూరు రైతు ధర్నా కర్యక్రమం - పాల్గొన్న హరీశ్ రావు
తొర్రూరు రైతు ధర్నా కర్యక్రమం - పాల్గొన్న హరీశ్ రావు

పది నెలల పాలనలో రేవంత్ రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రైతు ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు చప్పుడు చేయటం లేదని దుయ్యబట్టారు.

రుణమాఫీ కాలేదు - హరీశ్ రావు

“మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు. డిసెంబర్ 9 అన్నాడు. ఆగష్టు 15 అన్నాడు.  కొమరెల్లి మల్లన్న, యాదాద్రి , భద్రాద్రి, సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు పెట్టాడు. మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయింది.  మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చెయ్యి హరీష్ రావు అని సవాల్ విసిరిండు.  రుణమాఫి అయితే ఎందుకు ఇంత మంది ఇక్కడి ధర్నాకు వచ్చారు…?  పాలకుర్తి మండలం లోనే 4314 మందికి రుణమాఫీ కాలేదు.  మంత్రి తుమ్మలనే చెప్పారు 22 లక్షల మందికి చేశాం. మిగతా వారికి కాలేదు అన్నాడు.  చెప్పిన 22 లక్షల మందిలో కూడా చాలా మంది రుణమాఫీ కాలేదు” అని హరీశ్ రావు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“వరంగల్ వచ్చి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు.  భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు అన్నారు.. ఇప్పటికి కాలేదు.  రైతు కూలీలు, భూమి లేని రైతులకు పంట బీమా పథకం అన్నారు. అది కూడా కాలేదు. పోడు, అసైండ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామన్నారు.  అన్ని రకాల పంటలకు 500 బోనస్ అని, ఇప్పుడు సన్నాలకి మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.   రేవంత్ రెడ్డి దయ వల్ల రాహుల్ గాంధీ మీద నమ్మకం లేకుండా పోతుంది.  వరంగల్ రైతు డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేదు”అని హరీశ్ రావు ప్రశ్నించారు.

 హైద్రాబాద్ లో హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.  మూసిని ఆనుకొని ఉన్న పేదల ఇళ్ళ్ళు కూల గొడితే ఊరుకోమని హెచ్చరించారు.  దసరా పండుగ లోపు రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్ననట్లు తెలిపారు.  రైతులదరికి రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టమన్నారు.

దసరా తర్వాత రాహుల్ ఇంటి ముందు ధర్నా…

“రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి కనిపించడం లేదా…? అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తున్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి. డిఏ లు ఇవ్వక ఉద్యోగులను మోసం చేస్తున్నారు. అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి అన్యాయమే చేశాడు. రేవంత్ రెడ్డి సర్కార్ మెడల వంచి మీకు రుణమాఫీ అమలు చేయిస్తాం.  దసరా తరవాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తం. రుణమాఫీ అమలు చేయిస్తాం” అని హరీశ్ రావు కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో  కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు.  24 గంటలు కాదు 10, 12 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన మీద 300 కేసులు పెట్టారని.. ఇప్పుడు 30 పెట్టారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ సర్కార్ ను వదిలిపెట్టేదేలేదని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలో చెప్పాలన్నారు. ఘన్ పూర్ లో బై ఎలక్షన్ వస్తదని… రాజయ్యను గెలించుకోవాలని కోరారు.

Whats_app_banner