Hanamkonda Accident : కొడుకు పుట్టిన సంతోషం, మూడు నెలల్లోనే ఆవిరి!
Hanamkonda Accident : కొడుకు పుట్టాడని మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన ఆ కుటుంబానికి అనుకోని ప్రమాదం జరిగింది. దారికాచిన మృత్యువు మూడు నెలల పనికందును బలితీసుకుంది. హనుమకొండ జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
Hanamkonda Accident : కొడుకు పుడితే మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకున్నారు ఆ దంపతులు. వంశోద్ధారకుడు వస్తే, దర్శనానికి వచ్చి పూజలు చేస్తామని ముడుపు కట్టుకున్నారు. అంతా సజావుగా సాగి కొడుకు పుట్టగా.. ఆ సంతోషం మూడు నెలల్లోనే ఆవిరైంది. కొడుకు పుట్టిన సంతోషంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వస్తుండగా.. రహదారి ప్రమాదం ఆ కుటుంబంలో ఆనందాన్ని దూరం చేసింది. ఈ ఘటన జాతీయ రహదారి–163పై హనుమకొండ జిల్లా(Hanamkonda Accident) ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చెందిన ఎలగందుల శ్రీకాంత్, స్రవంతి దంపతులకు మూడు సంవత్సరాల కిందట పాప పుట్టింది. ఈ క్రమంలోనే వంశోద్ధారకుడు కావాలని, కొడుకు కోసం ఆ దంపతులు మొక్కులు మొక్కారు. కోరుకున్నట్టుగానే వారికి మూడు నెలల కిందట పండంటి బాబు కూడా జన్మించాడు. దీంతో కోర్కె నెరవేరినందుకు ఆ దంపతులు దేవుళ్లకు మొక్కులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా(Mulugu District) మల్లూరులోని హేమాచల శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు గురువారం ఉదయం కారులో బయలుదేరి వెళ్లారు. అక్కడ పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్న అనంతరం సాయంత్రం సమయంలో తిరుగు ప్రయాణం అయ్యారు.
లారీను ఢీకొన్న కారు
మొక్కులు చెల్లించుకుని పిల్లలతో కలిసి తిరుగు ప్రయాణమైన శ్రీకాంత్, స్రవంతి దంపతులు ఎన్.హెచ్–163 మీదుగా వరంగల్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ సమీపంలోకి రాగా.. రోడ్డుపై పార్క్ చేసి ఉన్న లారీని కారు(Car Met Accdient) వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీంతో కారు మందు సీట్లలో కూర్చుని ఉన్న స్రవంతికి తీవ్ర గాయాలు కాగా.. ఆమె ఒడిలో ఉన్న మూడు నెలల పసికందు(Infant Died) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాంత్ తో పాటు వారి కూతురు శ్రీనికకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. కారు నుంచి వారిని బయటకు తీయగా.. అప్పటికే మూడు నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లడంతో ఆ దంపతులు తీవ్రంగా రోధించారు. దైవ దర్శనానికి వస్తే.. ఆ దేవుడే బిడ్డను దూరం చేశాడంటూ తల్లి విలపించిన తీరు అక్కడున్న వాళ్లందరినీ కంటతడి పెట్టించింది. ఆ తరువాత ఆత్మకూరు సీఐ క్రాంతి కుమార్, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ క్రాంతి కుమార్ వివరించారు.
రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్
జాతీయ రహదారి–163పై మెయిన్ జంక్షన్ల వద్ద అడ్డదిడ్డంగా నిలుపుతున్న భారీ వాహనాలు తరచూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా జరిగిన యాక్సిడెంట్(Road Accidents) లో ఆలేరుకు చెందిన శ్రీకాంత్, స్రవంతిల మూడేళ్ల కొడుకు చనిపోగా.. ప్రమాదానికి కారణం రహదారిపై నిలిపిన వాహనాలేనని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ మార్గంలో గోదావరి ఇసుక టిప్పర్లు(Sand Transport Lorries), ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండగా.. టీ, టిఫిన్లు, ఇతర అవసరాల కోసం గుడెప్పాడ్, ఆత్మకూరులాంటి జంక్షన్ల వద్ద ఇష్టారీతిన వాహనాలను పార్క్ చేస్తున్నారు. కనీసం పార్కింగ్ లైట్స్ కూడా వేయకుండా నిలిపి ఉంచుతుండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకోగా.. తాజాగా యాక్సిడెంట్ లో మూడు నెలల పసికందు ప్రాణాలు(Infant Died) కోల్పోవడం అందరినీ కలచి వేసింది. దీంతోనే జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)