Kalyana Lakshmi Funds : 'కల్యాణ లక్ష్మీ' స్కీమ్ కు నిధులు విడుదల - అప్లికేషన్ ఇలా చేసుకోవచ్చు..!
కల్యాణలక్ష్మీ పథకానికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1225.43 కోట్లను విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి నిధులను జమ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలను తెలిపారు.
కళ్యాణలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. ఈ సంవత్సరం 2024-25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.2175.00 కోట్లు కేటాయించింది. మొదటి దశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది.
పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా నిధులు విడుదల చేసింది. కళ్యాణ లక్ష్మి కోసం మొత్తం 65,026 దరఖాస్తులు చేసుకోగా ఈ సంవత్సరం 2024-25కి గాను ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం 31 మార్చి 2024 వరకు 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మార్వో వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు 28,225 కాగా .. ఆర్డీవో వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయని వివరించారు.
పెండింగ్ దరఖాస్తులు పోగా మిగిలిన 24,038 దరఖాస్తులకు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి పొన్నం ప్రకటించారు. మొదటి దశలో విడుదల అయిన 1225.43 కోట్లలో మొత్తం దరఖాస్తులు కోసం రూ .649 .86 కోట్లు డిమాండ్ ఉందన్నారు. మంజూరు అయిన దరఖాస్తుల కోసం రూ 240. 73 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా రూ 984.70 కోట్లు రిమైనింగ్ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.
బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆడ బిడ్డల పెళ్లిళ్ల సహాయం కోసం కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 1,00,116 రూపాయలు సహాయం చేస్తుంది. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 1225.43 కోట్లు మంజూరు చేయడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెప్పారు.
ఎలా దరఖాస్తు చేయాలి..?
- ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే వారు telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- హోం పేజీలో "కళ్యాణ లక్ష్మి" ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పెళ్లి కుమార్తె వ్యక్తిగత సమాచారం మొదలు కులం, ఆదాయం, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను నమోదు చేయాలి.
- అన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన స్కాన్ కాపీని అప్ లోడ్ చేయాలి.
- సమాచారం మొత్తం అందించిన తర్వాత "Submit" ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.
- ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి కల్యాణలక్ష్మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు.
అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు:
- 1. మొదటి వివాహమే అని ధ్రువీకరణ పత్రం
- 2. వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి ఆమోద ధ్రువీకరణ
- 3. పెళ్లి కూతురు ఫోటో
- 4. వయసు ధ్రువీకరణ పత్రం
- 5. ఆధార్ కార్డులు (తల్లి, పెళ్లి కొడుకు సహా)
- 6. తల్లి బ్యాంక్ ఖాతా పాస్ బుక్ స్కాన్‌డ్ కాపీ,
- 7. పెళ్లి కూతురు బ్యాంక్ ఖాతా స్కాన్‌డ్ కాపీ
- దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ఈపాస్ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. మీ సేవ సెంటర్‌లోనైనా, తెలిసిన వారి సాయమైనా తీసుకోవచ్చు.