Hyderabad : హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బార్లు, పబ్బుల్లో తనిఖీలు.. నలుగురికి పాజిటివ్
Hyderabad : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజు రోజుకూ పెరుగుతోంది. డ్రగ్స్ కారణంగా యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో రిచ్ పీపుల్ మాత్రమే డ్రగ్స్ వినియోగించేవారు. ఇప్పుడు కల్చర్ మిడిల్ క్లాస్ యూత్‌కు కూడా పాకింది. తాజాగా హైదరాబాద్‌లో నలుగురు డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. బార్లు, పబ్బుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు చేశారు. 5 పబ్బుల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో నలుగురికి పాజిటివ్ వచ్చింది. శేరిలింగంపల్లిలోని కోరం క్లబ్‌లో ఇద్దరికి, జూబ్లీహిల్స్‌లోని బేబిలాన్ పబ్‌లో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. చిన్న నాగేష్, రవికుమార్, కేశవరావు, అబ్దుల్ రహీమ్ డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు. ఈ నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఉక్కుపాదం..
'డ్రగ్స్‌తో పట్టుబడితే వినియోగదారులపై కూడా కేసులు పెడతాం. ఇకపై డ్రగ్స్ వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతాం. డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారు. డ్రగ్స్ అలవాటు చేసేవారిపై కూడా కేసులు పెడతాం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి' అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ గురించి ఎవరికి సమాచారం తెలిసినా పోలీసులకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేకంగా కిట్..
డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. కొత్తగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. టీఎస్‌న్యాబ్ ఈ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఓ కిట్‌ను రూపొందించింది. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని, గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ కిట్‌ను ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో టెస్టులు మొదలుపెట్టారు.
పాత నేరస్తుతలపై ఫోకస్..
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గట్టిగా పనిచేస్తోంది. డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన పాత నేరస్తులపై నిఘా పెంచింది. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతోంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికలు ముగిసే నాటికి తెలంగాణలో వివిధ చోట్ల రూ.29.31 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు జనవరి 21న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జాంబియాకు చెందిన వ్యక్తి నుంచి రూ. 41 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.