TSPSC Chairman: టిఎస్‌పిఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి?
TSPSC Chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఎంపిక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఛైర్మన్ రేసులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
TSPSC Chairman: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ ఎంపికపై ప్రభుత్వం దృష్టి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈ పదవిని చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
టిఎస్‌పిఎస్సీ ఛైర్మన్ పదవి కోసం మొత్తం ముగ్గురు పేర్లను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ చివరకు తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే చైర్మెన్,సభ్యుల నియామకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానించగా, టిఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి కోసం మొత్తం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు.
రేసులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సిఎస్) శాంతి కుమారి, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి,సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశమై దరఖాస్తులను పరిశీలించారు.
ఛైర్మన్ పదవి కోసం మహేందర్ రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి,రెండు నెలలలో పదవి విరమణ చేయనున్న మరో ఐఏఎస్ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ముగ్గురిలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒక్కరే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కావడంతో ఆయన ఎంపికకు ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. టిఎస్పిఎస్సి చైర్మన్ నియామకానికి సంబంధించిన పత్రాలను గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ సర్కార్ పంపించినట్లు తెలుస్తోంది.
యూపీఎస్సీ తరహాలో టిఎస్పీఎస్సీ ప్రక్షాళన
బిఆర్ఎస్ హయాంలో టిఎస్‌పిఎస్సీపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నపత్రాల లీకేజీ, సభ్యుల నిర్లక్ష్యం,ప్రశ్నా పత్రాలలో తప్పులు కారణంగా టిఎస్పీఎస్సీ పై అనేక విమర్శలు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే యూపీఎస్సీ తరహాలో టిఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని విద్యార్దులకు, నిరుద్యోగులకు హామీనిచ్చారు.దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టిఎస్పీఎస్సీ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. టిఎస్పీఎస్సీ లో ప్రతీ పరీక్ష పారదర్శకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.
టిఎస్పీఎస్సీ ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ ను కలిసి దీనిపై ప్రధానంగా చర్చించారు. సిఎం ఆదేశాలతో అధికారులు కేరళ లాంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడ వ్యవస్థను పరిశీలించి వచ్చారు.