Warangal : ఆర్టీసీ బస్ ఢీకొని ఫుడ్ డెలివరీ బాయ్ మృతి.. ఆందోళనకు దిగిన జొమాటో బాయ్స్
Warangal : వరంగల్ లో జరిగిన రోడ్డు ప్రమాదం డెలివరీ బాయ్ ప్రాణాలు తీసింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు బైక్ మీద వెళ్తుండగా.. వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతిచెందారు. తోటి డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలో కరీమాబాద్ ఉర్సు ప్రాంతానికి చెందిన బడుగు చందు ప్రసాద్(35) కొంతకాలంగా జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆర్థికంగా కలిగిన కుటుంబం కాకపోవడంతో ఫుల్ టైమ్ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో డ్యూటీ నిమిత్తం ఫుడ్ డెలివరీ చేసేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
జోమాటోలో వచ్చిన ఆర్డర్ ప్రకారం ఉదయం 10.30 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు హనుమకొండ బస్టాండ్ వైపు నుంచి అదాలత్ సెంటర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాల సముద్రం ఏరియాలోని హయగ్రీవచారీ గ్రౌండ్ సమీపంలోకి రాగానే హనుమకొండ బస్టాండ్ నుంచి వేలేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చింది. చందు ప్రసాద్ వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చందు ప్రసాద్ బైక్ పై నుంచి కింద పడిపోయారు. తల, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరార్ అయ్యాడు.
సీపీఆర్ చేసినా దక్కలే..
బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో చందు ప్రసాద్ కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ జనాలు గుమికూడగా.. అటుగా వచ్చిన జొమాటో బాయ్స్ చందు ప్రసాద్‌కు సీపీఆర్ చేసి ఊపిరి అందించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడతో చందు ప్రసాద్ ను వెంటనే పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చందు ప్రసాద్ అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు.
విలపించిన కుటుంబ సభ్యులు
చందు ప్రసాద్‌కు భార్య, కూతురు, తల్లి ఉన్నారు. కుటుంబ భారమంతా ఆయనే మోస్తుండగా, అనుకోని ప్రమాదం ఆ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసింది. చందు ప్రసాద్ ప్రమాదానికి గురైన తర్వాత అక్కడున్న వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చందు ప్రసాద్ తల్లి, భార్య, కూతురు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. నడిరోడ్డుపై ఆ కుటుంబ సభ్యులు రోధించిన తీరు అక్కడున్న వాళ్ళందరినీ కంటతడి పెట్టించింది.
రోడ్డుపై బైఠాయించిన డెలివరీ బాయ్స్
చందు ప్రసాద్ బైక్‌ను ఆర్టీసీ డ్రైవర్ సారంగపాణి ఢీ కొట్టగా.. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకొని న్యాయం చేయాలంటూ జోమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. బాల సముద్రంలో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. చందు ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డెలివరీ బాయ్స్ ధర్నాతో రోడ్డు పై రాకపోకలకు అంతరాయం కలిగింది. సుబేదారి పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పారు. మృతుడు చందు ప్రసాద్ భార్య చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సుబేదారి పోలీసులు వివరించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)