Hyderabad Police : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. వాహనదారులు ఈ రూల్స్ పాటించాల్సిందే.. కఠిన చర్యలకు సిద్ధమైన పోలీసులు-hyderabad traffic police steps up for road safety and will crackdown against helmet less and wrong side driving ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Police : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. వాహనదారులు ఈ రూల్స్ పాటించాల్సిందే.. కఠిన చర్యలకు సిద్ధమైన పోలీసులు

Hyderabad Police : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. వాహనదారులు ఈ రూల్స్ పాటించాల్సిందే.. కఠిన చర్యలకు సిద్ధమైన పోలీసులు

Basani Shiva Kumar HT Telugu
Nov 05, 2024 11:42 AM IST

Hyderabad Police : హైదరాబాద్ నగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల ఇకపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ రూల్స్ నవంబర్ 5 నుంచే అమలు కానున్నాయి.

వాహనదారులు ఈ రూల్స్ పాటించాల్సిందే
వాహనదారులు ఈ రూల్స్ పాటించాల్సిందే (@HYDTP)

వాహనదారుల భద్రత కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. నవంబర్ 5 నుండి హెల్మెట్ లెస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. వాహనదారులు రూల్స్ పాటించకుంటే.. జరిమానా, శిక్ష తప్పదని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జరిమానాలు..

1.హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే: రూ.200 జరిమానా

2.రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే: రూ.2000 జరిమానా, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్.

హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో గత 3 రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ద్విచక్రవాహనదారులు మరణించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

1.నవంబర్ 1న గోషామహల్‌లోని అలాస్కా జంక్షన్ వద్ద డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో 48 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడు తలకు గాయాలై మరణించాడు.

2.నవంబర్ 2న తార్నాక సమీపంలో 25 ఏళ్ల యువతి ఆర్టీసీ బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది.

3.నవంబర్ 3న హెల్మెట్ లేని బైక్ రైడర్ ఎన్టీఆర్ మార్గ్‌లో తలకు గాయాలై మరణించాడు. ద్విచక్రవాహనాన్ని రాంగ్ రూట్‌లో నడుపుతూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 215 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 100 మంది ద్విచక్రవాహనదారులు కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించారు. 46 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోయారు. హెల్మెంట్ పెట్టుకుంటే.. 70 శాతం వరకు ప్రాణాలతో బయటపడేవారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఇకనుంచి అయినా.. వాహనదారులు, ముఖ్యంగా బైకర్లు విధిగా హెల్మెంట్ ధరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని గురించి ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా చాలామంది మారకపోవడంతో.. కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

ఓఆర్ఆర్‌పై..

ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్‌ల దగ్గర డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయనున్నారు. ఇప్పటికే యాక్సిడెంట్‌ అనాలసిస్‌ ప్రివెన్షన్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

పోలీసులు, అధికారులు రోడ్ల మీద ఉంటేనే ట్రాఫిక్‌ నియంత్రణలో ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్యల కోసం యాక్సిడెంట్‌ అనాలసిస్‌ ప్రివెన్షన్‌ టీం ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలను, వాహనాల వేగాన్ని తగ్గించేందుకు డ్రంకెన్‌ డ్రైవ్‌ (డీడీ) నిర్వహిస్తున్నామని.. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.

Whats_app_banner