Selfie For Runa Mafi : సెల్ఫీ ఫర్ రుణమాఫీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతులు-farmers of siddipet initiated selfie for runa mafi program ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Selfie For Runa Mafi : సెల్ఫీ ఫర్ రుణమాఫీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతులు

Selfie For Runa Mafi : సెల్ఫీ ఫర్ రుణమాఫీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతులు

HT Telugu Desk HT Telugu
Sep 23, 2024 02:54 PM IST

Selfie For Runa Mafi : రుణ మాఫీ కోసం తెలంగాణ రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో రైతులు సెల్ఫీలు తీసి సీఎం కార్యాలయానికి పంపారు.

సెల్ఫీ ఫర్ రుణమాఫీ
సెల్ఫీ ఫర్ రుణమాఫీ

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో రుణమాఫీ కానీ రైతులు.. "సెల్ఫీ ఫర్ రుణమాఫీ" అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ధర్మారం గ్రామంలోని రైతులు అందరూ కలిసి ఒకచోట చేరి "సెల్ఫీ ఫర్ రుణమాఫీ" వీడియోలు తీసి ముఖ్యమంత్రి కార్యాలయాలకు చేరేలా ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ మాట్లాడుతూ.. రుణ మాఫీ కానీ రైతులు ఎంత మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. వారి వేదనను కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేయడానికే ఈ డిజిటల్ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రుణ మాఫీ చేసిన అని జబ్బలు చరుచుకున్న సీఎం రేవంత్ రెడ్డికి.. రైతులు గట్టి జవాబు చెబుతూ.. సెల్ఫీ వీడియోలు తీసి పంపారన్నారు. ఒక్క ధర్మారం గ్రామంలోనే 300 మంది రైతులు సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియోలు తీసి పంపారన్నారు. రుణమాఫీ కానీ రైతులు ఈ నెల 18న మిరుదొడ్డి తహశీల్ధార్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా చేస్తే.. బీఆర్ఎస్ నాయకులూ వారికీ డబ్బులిచ్చి ఆందోళన చేయించారని కాంగ్రెస్ నాయకులూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేశామని అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. రుణమాఫీ కానీ రైతుల సెల్ఫీ వీడియోలే గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. సీఎం, మంత్రులు వందశాతం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పితే.. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కి, ఇప్పుడు అందరిని మోసం చేస్తున్నారని విమర్శించాడు. ఇప్పటికైనా సీఎం అలోచించి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రిని రైతులు సెల్ఫీ వీడియోల ద్వారా డిజిటల్ ర్యాగింగ్ చేస్తారని హెచ్చరించారు. రుణమాఫీ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సెల్ఫీ వీడియో ఉద్యమం లేపడం ఖాయమన్నాడు.

రేవంత్ రెడ్డి వి దొంగ మాటలు..

ధర్మారం గ్రామానికి చెందిన కరికే మైసయ్య అనే రైతు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సార్ రూ. 2 లక్షలు రుణమాఫీ చేయమని రైతులము అడిగామా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రుణమాఫీ చేస్తామని మీరే చెప్తిరి.. ఇప్పుడేమో కొంతమందికి చేసి, మరికొందరికి చేయకపోతిరి అంటూ వ్యాఖ్యానించారు. తనకు రూ. 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉంటే.. అవి బ్యాంకులో కట్టానని చెప్పారు. అయినా రుణమాఫీ కాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని మాయమాటలు చెప్తుడు.. అందుకే సీఎంకు సెల్ఫీ వీడియోను తీసి పంపుతున్నా అని రైతు చెప్పుకొచ్చాడు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)