rythu runa mafi : మేడ్చల్‌లో విషాదం.. రుణమాఫీ కాలేదని అగ్రికల్చరల్ ఆఫీసులో రైతు ఆత్మహత్య
rythu runa mafi : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం జరిగింది. రైతు రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుడి కుటుంబాన్ని హరీశ్ రావు పరామర్శించారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు ఆత్మహత్య కలకలం రేపింది. రుణమాఫీ జరగలేదని.. రైతు సురేందర్ రెడ్డి (52) అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో మార్చారీలో ఉన్న సురేందర్ రెడ్డి డెడ్ బాడీ వద్ద.. మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి నివాళులు అర్పించారు.
హరీష్ రావు ఆవేదన..
'రుణమాఫీ కాలేదన్న కారణంతో మేడ్చల్‌కు చెందిన రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసింది. రైతన్నలారా.. రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ధైర్యాన్ని కోల్పోకండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ప్రతి రైతుకు రుణమాఫీ చేసే దాకా ప్రభుత్వాన్ని వదలిపెట్టం. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తం' అని హరీష్ రావు స్పష్టం చేశారు.
డెడ్ లైన్ ముగిసింది..
'ముఖ్యమంత్రి.. మీ తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నరు. రుణమాఫీ కాదేమోనని ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. దయచేసి బాధ్యతగా వ్యవహరించండి. మేనిఫెస్టోలో చెప్పినట్లు రైతులందరికి రుణమాపీ అమలు చెయ్యండి. రుణమాఫీ అమలు విషయంలో మీరు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెల కావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోండి' అని హరీష్ రావు హితవు పలికారు.
పురుగుల మందు డబ్బాలతో..
రుణమాఫీ కాలేదంటూ.. పురుగుల మందు డబ్బాలతో వరంగల్ కెనరా బ్యాంకు ఎదుట రైతులు ఆందోళన చేశారు. ఇంకా పలు ప్రాంతాల్లో అన్నదాతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇస్తున్నారు. అన్నదాతలకు అండగా ఉండామని స్పష్టం చేస్తున్నారు.
మంత్రుల స్పందన..
రైతు రుణ మాఫీకి సంబంధించి అన్నదాతలు చేస్తున్న ఆందోళనలపై గత నెల 19న మంత్రులు స్పందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణ మాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి. అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి అర్హులైన అందరికీ రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ మొత్తం చేయలేకపోయం.. మిగిలిన రూ. 12 వేల కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.